ముందస్తు ఎన్నికలు, ఇదీ యాక్షన్ ప్లాన్ - మంత్రులకు సీఎం జగన్ క్లారిటీ..!!
ఏపీలో ఎన్నికలకు సిద్దంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ మంత్రలుకు దిశా నిర్దేశం చేసారు. కేంద్రం ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్ దిశగా ఆలోచన చేస్తున్న సమయంలో అక్కడి నిర్ణయాలకు అనుగుణంగా ఏపీలో ఎన్నికలపై సంకేతాలు ఇచ్చారు. విశాఖ నుంచి పాలన పైనా తేల్చి చెప్పారు. అదే సమయంలో అసెంబ్లీ వేదికగా చంద్రబాబు స్కాంలను బయట పెట్టాలని నిర్ణయించారు. మంత్రులు ఇక సీరియస్ గా పని చేయాలని సీఎం స్పష్టం చేసారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా:ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అధికారిక అజెండా తరువాత మంత్రులతో ముఖ్యమంత్రి రాజకీయ అంశాలపైన చర్చించారు. ఈ సమయంలో ఎన్నికలకు సంబంధించి కీలక సూచనలు చేసారు. కేంద్రంలో జమిలి ఎన్నికల పైన చర్చ జరుగుతున్న వేళ ఎప్పుడు ఎన్నికలకు వచ్చినా సిద్దంగా ఉండాలని మంత్రులకు నిర్దేశించారు.

కేంద్రం ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్ పేరుతో ఎన్నికలకు వెళ్తే ఏపీకి అప్పుడే ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేసారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉందని సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఎప్పుడు ఎన్నికలు జరిగినా సిద్దంగా ఉండాలని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు.
విశాఖలోనే దసరా పండుగ:విశాఖ నుంచి పాలన ప్రారంభించటం పైనా ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చారు. విశాఖలోనే దసరా పండుగ అంటూ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. మూడు రాజధానుల ప్రతిపాదనలో భాగంగా ప్రభుత్వం విశాఖ ను పరిపాలనా రాజధానిగా పేర్కొంది. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది.
దీంతో, ముందుగా ముఖ్యమంత్రి కార్యాలయం విశాఖ కు తరలించి వారంలో మూడు రోజులు అక్కడ నుంచే పాలనా వ్యవహారాల ను పర్యవేక్షించాలని నిర్ణయించారు. ఇప్పటికే సీఎం ఇదే విషయాన్ని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ లోనూ స్పష్టం చేసారు. ఇప్పుడు మంత్రివర్గ సమావేశంలో మరింత క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి కార్యాలయం మాత్రమే విశాఖకు తరలి వెళ్లనుంది.

చంద్రబాబు కేసులను వివరిద్దాం:ఇక, చంద్రబాబు అరెస్ట్..కేసుల వ్యవహారం పైనా జగన్ స్పందించారు. అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రజలకు అందరికీ అర్దమయ్యేలా చంద్రబాబు స్కాంల గురించి సవివరంగా సభలో అన్ని అంశాలను చర్చిద్దామని ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలుస్తోంది. మంత్రులు అసెంబ్లీ సమావేశాలకు పూర్తి సన్నద్దతతో హాజరు కావాలని సూచించారు.
అదే సమయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం గురించి సభ నుంచి వివరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రం అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పైన పార్టీ ముఖ్య నేతలతో జగన్ సమావేశం కానున్నారు. ఈ నెల 25న పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం జగన్ వర్క్ షాప్ నిర్వహణకు నిర్ణయించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications