మూడు సీట్లు వైసీపీకే - ఒకటి కడప..మరొకటి శ్రీకాకుళం : జాబితా ప్రకటనకు రంగం సిద్దం..!!
ఏపీలో ఎమ్మెల్సీ ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి రంగం సిద్దమైంది. ఎన్నికల సంఘం ఎమ్మెల్యే కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే పదవీ విరమణ చేసిన వైసీపీ నుంచి డీసీ గోవింద రెడ్డి..బీజేపీ నుంచి సోము వీర్రాజు..టీడీపీ నుంచి అహ్మద్ షరీష్ స్థానంలో కొత్త వారి నియామకం పైన పార్టీ అధినేత..ముఖ్యమంత్రి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 9వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభం కానుంది.

సామాజిక సమీకరణాలే కీలకంగా
దీంతో..ఈ నెల 8న వైసీపీ నుంచి భర్తీ చేయనున్న ముగ్గురి పేర్లను పార్టీ అధికారికంగా ప్రకటించనుంది. శాసనసభలో వైసీపీకి పూర్తి సంఖ్యా బలం ఉండటంతో ప్రకటించిన ముగ్గురు అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నిక కావటం లాంఛనంగానే కనిపిస్తోంది. పదవీ విరమణ చేసిన ముగ్గురిలో వైసీపీకి చెందిన గోవిందరెడ్డిని రెన్యువల్ చేస్తామని సీఎం జగన్ ఇప్పటికే ప్రకటించారు. బద్వేలు ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలుపొందటంతో గోవిందరెడ్డి రెన్యువల్ కు ఎటువంటి అడ్డంకి లేదు.

కడప..శ్రీకాకుళం..గోదావరి జిల్లాలకు ప్రాధాన్యత
ఒకటి సీమ ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఖరారు అవ్వటంతో రెండో స్థానం శ్రీకాకుళం జిల్లాకు కేటాయించాలని సీఎం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఒకటి ఓసీ.. మరో రెండు స్థానాలు బీసీ..ఎస్సీ వర్గాలకు కేటాయించాని నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగా.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పాలవలస విక్రాంత్ పేరు తుది జాబితాలో ఉన్నట్లుగా తెలుస్తోంది. శ్రీకాకుళం వైసీపీ సీనియర్ నేత పాలవలస రాజశేఖర్ కుమారుడైన విక్రాంత్ కే సీటు ఖరారయ్యే అవకాశం ఉంది. జిల్లా పరిషత్ ఎన్నికల్లో పాలవలస కుటుంబానికి జెడ్పీ ఛైర్మన్ పదవి దక్కుతుందని భావించారు.

శ్రీకాకుళం నుంచి బీసీ అభ్యర్ధికి
అయితే, చివరి నిమిషంలో ఇచ్చాపురం వైసీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పిరియా సాయిరాజ్ సతీమణి విజయకు జెడ్పీ చైర్ పర్సన్ పదవి కేటాయించారు. ఆ సమయంలోనే రాజశేఖర్ కుటుంబానికి ఎమ్మెల్సీ పదవి హామీ ఇచ్చారు. దీంతో..ఇప్పుడు విక్రాంత్ కు ఎమ్మెల్సీ ఖాయమని తెలుస్తోంది. ఇక, మూడో స్థానం ఎస్సీ వర్గానికి కేటాయించనున్నారు. ఎస్సీ వర్గానికి చెందిన మహిళకు సీటు కేటాయిస్తారని చెబుతున్నారు. పలువురి పేర్లు ఈ సీటు కోసం పరిశీలనలో ఉన్నాయి. అయితే, వచ్చే వారం రోజుల్లోనే స్థానిక సంస్థల కోటాలో భర్తీ చేయాల్సిన మరో 11 స్థానాలకు సంబంధించి షెడ్యూల్ విడుదల కానున్నట్లు పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.
Recommended Video

త్వరలో మరో 11 ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీకే
ఆ స్థానాలు సైతం వైసీపీ ఖాతాలోనే జమ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆ జాబితాలో ఇప్పటికే సీఎం హామీ ఇచ్చి..వెయిటింగ్ లో ఉన్న వారితో పాటుగా... ఒక సలహాదారుకు సైతం అందులో అవకాశం ఇవ్వనున్నట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే, ముుందుగా ముగ్గురి ఎమ్మెల్సీ అభ్యర్ధుల జాబితాను 7వ తేదీ లేదా 8న అధికారికంగా ప్రకటిచంనున్నారు. దీంతో..ఈ మూడు స్థానాలకు పేర్లు ఫైనల్ కావటంతో...ఈ సారి భర్తీ కానున్న 11 స్థానాల్లో అవకాశం కోసం ఆశావాహులు తమ వంతు ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎక్కడా ఇబ్బందులు రాకుండా..అందరినీ సమన్వయం చేసుకుంటూ ఆ 11 మంది జాబితా ఖరారు చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications