టీడీపీ నియోజకవర్గంలో అభ్యర్ధిని ఖరారు చేసిన సీఎం జగన్..!!
ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల దిశగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్నారు. వచ్చే ఎన్నికలకు అభ్యర్ధులను ఖరారు చేస్తున్నారు. పలు రకాల సర్వేల ఆధారంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ సీఎం జగన్ అభ్యర్దులను ప్రకటిస్తున్నారు. ముందుగా టీడీపీ నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఎంపిక పైన సీఎం ఫోకస్ చేసారు. అందులో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే భవాని ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కో ఆర్డినేటర్ ను ప్రకటించారు.
రాజమండ్రి కో ఆర్డినేటర్ నియామకం
రాజమండ్రి నుంచి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు వైసీపీ రాజమండ్రి నియోజవకర్గ కో ఆర్డినేటర్ గా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ను నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కు వైద్యుడిగా మంచి పేరుంది.

విజయభారతి ఛారిటబుల్ ట్రస్టు పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన సతీమణి రాధిక ప్రముఖ న్యాయవాదిగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దివంగత జక్కంపూడి రామ్మోహనరావు మంత్రిగా ఉన్న సమయంలో గూడూరి శ్రీనివాస్ నగర పాలక సంస్థ కార్పోరేటర్ గా పోటీ చేసి విజయం సాధించారు.
ఆదిరెడ్డి భవానీ పై వైసీపీ అభ్యర్ధి
రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ తో కలిసి సీఎం జగన్ ను కలిసారు. రాజమండ్రి నగరంలోని రాజకీయ..అభివృద్ధి అంశాల పైన చర్చించారు. త్వరలోనే సీఎం జగన్ రాజమండ్రి పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఎన్నికల వేళ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను ఇక గూడూరి శ్రీనివాస్ నాయకత్వంలో నిర్వహించనున్నారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా ఆయనే బరిలో నిలవటం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి సీట్లు ఖరారు చేస్తున్నట్లు ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. దీంతో ఆదిరెడ్డి భవానీ లేదా కుటుంబ సభ్యులు వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలో నిలవనున్నారు. వైసీపీ నుంచి శ్రీనివాస్ అభ్యర్ధిత్వం దాదాపు ఖరారైనట్లే.

గూడూరి శ్రీనివాస్ ఖరారు
రాజమండ్రిలో 2014 లో టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్ధి ఆకుల సత్యనారాయణ వైసీపీ అభ్యర్ధి బొమ్మన రాజ్ కుమార్ పైన 26,377 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాశ రావుకు 53,637 ఓట్లు రాగా, జనసేన నుంచి పోటీ చేసిన అత్తి సత్యానారాయణ కు 23,096 ఓట్లు దక్కాయి. టీడీపీ నుంచి పోటీ చేసిన ఆదిరెడ్డి భవానీకి 83,702 ఓట్లు రాగా..30,065 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇప్పుడు టీడీపీ, జనసేన పొత్తు ప్రచారం వేళ..వ్యూహాత్మకంగా సీఎం జగన్ గూడూరి శ్రీనివాస్ ను ఎంపిక చేసారు.












Click it and Unblock the Notifications