గౌతమ్ రెడ్డి అంత్యక్రియల్లో సీఎం జగన్ - భారీగా తరలివచ్చిన అభిమానులు : కన్నీటి సంద్రం..!!
మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఉదయం నెల్లూరులోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. జొన్నవాడ మీదుగా బుచ్చి, సంగం, నెల్లూరుపాళెం, మర్రిపాడు, బద్వేలు సరిహద్దు జాతీయ రహదారి నుంచి బ్రాహ్మణపల్లి, కృష్ణాపురం, నందిపాడు మీదుగా ఉదయగిరికి చేరుకుంది. పలువురు మంత్రులు..ప్రభుత్వ సలహాదారు సజ్జల.. పార్టీ ఎమ్మెల్యేలు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. దారి పాడవునా అభిమానులు పూలు చల్లుతూ మేకపాటి కన్నీటి వీడ్కోలు పలికారు.

అంతిమ యాత్రలో భారీగా అభిమానులు
జోహార్ మంత్రి మేకపాటి, మెట్ట ప్రాంత ముద్దుబిడ్డ అమర్ రహే, అన్నా గౌతమన్నా అంటూ నినాదాలు చేసారు. సహచర మంత్రి అనిల్ బైక్ పై భారీ ర్యాలీ నిర్వహించి తమ మిత్రుడుకు నివాళి అర్పించారు. తండ్రి పార్దివ దేహం వద్ద వారసులు కుమార్తె సాయిఅనన్య, కుమారుడు కృష్ణార్జున రెడ్డి తమ తండ్రి తరహాలోనే వస్త్ర ధారణ చేసి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ (మెరిట్స్) ఆవరణలో అంత్యక్రియలకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు.

గౌతమ్ తల్లి..సతీమణికి భారతి ఓదార్పు
గౌతమ్ తల్లి తండ్రులు... సతీమణిని ఓదార్చటం ఎవరికీ సాధ్యపడలేదు. సీఎం జగన్..భారతి అక్కడకు చేరుకున్నారు. గౌతమ్ తల్లి..సతీమణిని భారతి ఓదార్చే ప్రయత్నం చేసారు. మేకపాటి రాజమోహన్ రెడ్డిని సీఎం జగన్ ఓదార్చారు. సీఎం జగన్.. గౌతమ్ కుటుంబ సభ్యులతో పాటుగా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. గౌతమ్ పార్దివ దేహం పైన గంధపు చెక్కలు ఉంచి తుది నివాళి అర్పించారు. ప్రభుత్వ లాంఛనాల నడుమ తమ కేబినెట్ సహచరుడికి సీఎం .. మంత్రులు తుది వీడ్కోలు పలికారు.

అంత్యక్రియల్లో సీఎం జగన్
గౌతమ్ కుటుంబ సభ్యులు..అభిమానులు అశ్రునయనాలతో అంత్యక్రియలు పూర్తి చేసారు. ఉదయగిరి..ఆత్మకూరు నియోజకవర్గాల్లోని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మేకపాటి అభిమానులు... వైసీపీ కార్యకర్తలు గౌతమ్ రెడ్డి చివరి చూపు కోసం తరలి వచ్చారు. అమెరికా నుంచి వచ్చిన గౌతమ్ కుమారుడు తండ్రి పార్దివ దేహాన్ని చూసి కన్నీరు మున్నీరు అయ్యారు. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఆయన నెల్లూరుకు చేరుకున్నారు.












Click it and Unblock the Notifications