టీటీడీ బోర్డు సిద్దం, నామినేటెడ్ పదవులు - సీఎం జగన్ ఎంపిక, లిస్టులో..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యే అభ్యర్దుల ఎంపికపైన కసరత్తు ప్రారంభించారు. ఇదే సమయంలో ఎన్నికల వేళ ఎక్కడా అసంతృప్తులకు అవకాశం లేకుండా కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీపై కసరత్తు ప్రారంభించారు. టీటీడీ బోర్డు కూర్పు తుది దశకు చేరింది. గెలుపే ప్రామణికంగా ఎమ్మెల్యే అభ్యర్ధులను ఖరారు చేస్తున్న సీఎం..సీట్లు దక్కని వారి భవిష్యత్ కు హామీ ఇస్తున్నారు.
నామినేటెడ్ పదవుల పండుగ: ఏపీలో ఎన్నికల వేళ అధికార వైసీపీలో నామినేటెడ్ పదవుల పండుగ మొదలైంది. రాష్ట్ర స్థాయిలో నియమించిన నామినేటెడ్ పదవుల పదవీ కాలం పూర్తయిన నేపథ్యంలో వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించాలని సీఎం జగన్ నిర్ణయించారు. 2021 జులై 17న 137 నామినేటెడ్ పదవులను ఒకేసారి భర్తీ చేసిన సీఎం జగన్ ఇప్పుడు మరోసారి పదవుల భర్తీపైన కసరత్తు ప్రారంభించారు.

ప్రాంతీయ -సామాజిక సమ తుల్యత పాటిస్తూ 50 శాతం పదవులు మహిళలకు కేటాయిస్తూ పదవులు ఖరారు కానున్నాయి. గతంలో ఈ నియామకాలు చేపట్టినప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం అంటే 76 మందికి పదవులు కేటాయించారు. 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఇదే ఫార్ములా అమలు చేసే అవకాశం కనిపిస్తోంది.
టీటీడీ బోర్డులో: ప్రతిష్ఠాత్మక టీటీడీ బోర్డు కూర్పు తుది దశకు చేరింది. అందులో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి సభ్యుల పేర్లు ఖరారయ్యాయి. ఏపీ నుంచి ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, పొన్నాడ సతీష్ కుమార్, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, ధనలక్ష్మీ, ఆళ్ల నాని, తిప్పేస్వామి, ఆనందరెడ్డి, గోదావరి జిల్లాల నుంచి సబ్బరాజు, మంగమ్మ పేర్లు దాదాపు ఖరారైనట్లు సమాచారం.
ఇదే సమయంలో తెలంగాణ నుంచి ఫార్మా పరిశ్రమకు చెందిన సత్యనారాయణ రెడ్డి పేరుకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. చివరి నిమిషం వరకు టీటీడీ బోర్డులో అకవాశం కోసం వస్తున్న ఒత్తిడి కారణంగా జాబితా ఆలస్యం అవుతున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ రోజు అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.
ఈ నెలలోనే నియామకాలు: ఇక, నియోజకవర్గాల నుంచి సేకరించిన సర్వే సంస్థల సమాచారం ఆధారంగా నామినేటెడ్ పదవులను ఖరారు చేస్తున్నారు. పార్టీ కోసం పని చేసిన వారికి ఎవరికి ఎలా న్యాయం చేయాలన్నదానిపై వారు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఒక్కో నియోజకవర్గం నుండి 50 మంది వరకూ అర్హుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లుగా సమాచారం.
ఇదే సమయంలో ఎన్నికల వేళ నియోజకవర్గాల వారీగా పార్టీ బాధ్యులను పెంచాలని భావిస్తున్నారు. మొత్తం 250 మందికిపైగా పేర్లతో సీఎం జగన్ వద్దకు జాబితా చేరినట్లు తెలుస్తోంది. ఇందులో 100 మందికిపైగా ఎంపిక చేయాల్సి ఉంది. వచ్చే వారం ఒకే విడతలో మొత్తంగా నామినేటెడ్ పదవులను భర్తీ చేసేలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని తుది జాబితా సిద్దం చేస్తున్నారని సమాచారం.












Click it and Unblock the Notifications