సీఎం జగన్ పుట్టినరోజు.. దేశంలోనే తొలి ఆర్గానిక్ ఆర్ట్ జగన్ ముఖచిత్రం; ఎమ్మెల్యే చెవిరెడ్డి అభిమానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైసీపీ నేతలు వేడుకలు జరుపుకుంటున్నారు. జగన్ జన్మదిన వేడుకలు ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎవరికి వారు జగన్ పై తమకు ఉన్న ప్రత్యేకమైన అభిమానాన్ని తెలియజేసేలా వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న నేతలు రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మరి కొందరు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిచ్చే విధంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టారు.

సేంద్రీయ సాగు కళ ద్వారా గడ్డిని ఉపయోగించి నేల పైన సీఎం జగన్ ముఖ చిత్రం
ఇదిలా ఉంటే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై తనకున్న ప్రత్యేకమైన అభిమానాన్ని చాటుకోవాలని సీఎంకు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేయడానికి రెడీ అయ్యారు ప్రభుత్వ విప్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. సీఎం జగన్ జన్మదినం పురస్కరించుకొని తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయ ఆవరణలోని గోశాల ముందు సేంద్రీయ సాగు కళ ద్వారా గడ్డిని ఉపయోగించి నేల పైన సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ చిత్రాన్ని తీర్చిదిద్దారు.
ఆర్గానిక్ ఆర్ట్ ఫార్మింగ్ ద్వారా రూపొందించిన ఈ చిత్రం వంద అడుగుల పొడవు వంద అడుగుల వెడల్పుతో 2 డీ ఆర్కిటెక్చర్ సాంకేతికతతో రూపొందించబడింది. చాలా పెద్ద గడ్డితో తయారు చేసిన ఈ ఆర్ట్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది.

పదిరోజులపాటు శ్రమించి .. దేశంలోనే తొలి ఆర్ట్ ఫార్మింగ్ తో చేసిన చిత్రం
కాంత్ రీషా అనే కళాకారుడు చేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందింపచేశారు. ఇది దేశంలోనే తొలి ఆర్ట్ ఫార్మింగ్ తో చేసిన చిత్రం కావడంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ముఖచిత్రం ఏర్పాటు చేయడం కోసం గత పది రోజుల నుండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సీఎం క్యాంప్ ఆఫీస్ వద్దనే ఉంటున్నారు.
ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆధ్వర్యంలో సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆర్గానిక్ ఆర్ట్ ఫార్మింగ్ తో ఈ ముఖచిత్రం రూపుదిద్దుకుంది. పదిరోజుల పాటు కళాకారుడు ఈ ఆర్ట్ కోసం చాలా శ్రమించాడు . డ్రోన్ పై నుండి చూస్తే సీఎం జగన్ ముఖచిత్రం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుందని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటున్నారు.

సీఎం జగన్ పై వర్ధిల్లు వెయ్యేళ్ళు అంటూ రూపొందించిన ఆడియో ఆవిష్కరణ
ఒక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రమే కాదు చాలా మంది వైసీపీ నేతలు జగన్ పై తమ అభిమానాన్ని పుట్టినరోజు సందర్భంగా వ్యక్తం చేయడానికి విభిన్న కార్యక్రమాలను చేపట్టారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సీఎం జగన్ పై వర్ధిల్లు వెయ్యేళ్ళు అంటూ రూపొందించిన ఆడియోను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు కొడాలి నాని, కురసాల కన్నబాబు, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు విడుదల చేశారు.
ఇదిలా ఉంటే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని నిర్ణయించినట్లుగా వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి పేర్కొన్నారు. ఎవరికి వారు జగన్ పై అభిమానం చాటుకోవటంలో పోటీ పడుతున్నారు.












Click it and Unblock the Notifications