సెప్టెంబర్ 4న సీఎం జగన్‌తో "మెగా" టీం భేటీ..బాలయ్య కలుస్తారా..?
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో మెగాస్టార్ చిరంజీవి టీం భేటీ ముహూర్తం ఫిక్స్ అయింది. కొద్ది రోజులగా ఏపీ ప్రభుత్వంతో సినీ పరిశ్రమ సమస్యల పైన చర్చించాలని టాలీవుడ్ పెద్దలు భావిస్తున్నారు. దీంతో ఏపీ సమాచార శాఖా మంత్రి పేర్ని నాని నేరుగా చిరంజీవి ఫోన్ చేసి సినిమా పరిశ్రమ సమస్యల పరిష్కారానికి సీఎం జగన్ సిద్దంగా ఉన్నారని చెప్పారు. సినీ పెద్దలతో కలిసి సీఎంను కలిసేందుకు సిద్దంగా ఉండాలని త్వరలోనే భేటీ సమయం ఖరారు చేస్తామని వివరించారు.

సినీ సమస్యలపై చిరంజీవి పెద్దన్న పాత్ర..
దీంతో..చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమలోని వివిధ విభాగాలకు చెందిన పెద్దలతో సమావేశమయ్యారు. ఆ సమయంలో ప్రభుత్వంతో చర్చించాల్సిన అంశాల పైన వారి నుంచి అభిప్రాయాలు సేకరించారు. వాస్తవంగా ఇప్పటికే సమావేశం జరగాల్సి ఉన్నా..సీఎం బిజీ షెడ్యూల్ తో పాటుగా కుటుంబ సభ్యులతో కలిసి సిమ్లా పర్యటన కారణంగా ఆలస్యం అయింది. దీంతో..సిమ్లా పర్యటన నుంచి వస్తూనే సీఎం జగన్ కడప పర్యటనకు వెళ్లనున్నారు. సెప్టెంబర్ 2న వైఎస్సార్ వర్దంతి కావటంతో ఆ రోజు సాయంత్రం వరకు అక్కడే ఉంటారు.

జగన్ - చిరంజీవి టీం అప్పాయింట్ టైం ఇదే..
దీంతో.. సెప్టెంబర్ 4వ తేదీన సీఎంతో అప్పాయింట్ మెంట్ ఖరారు చేస్తూ చిరంజీవికి ఏపీ ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం అందింది. ఆ సమావేశంలో ప్రధానంగా చర్చకు కారణమైన సినిమా టిక్కెట్ల ధరల పైన చర్చ జరగనుంది. వకీల్ సాబ్ టిక్కెట్ల వివాదం తరువాత ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాయింట్ కలెక్టర్ల పరిధిలో టిక్కెట్ల ధరల పెంపు..అదనపు షోల నిర్ణయాలు ఇక నుంచి ప్రభుత్వ అనుమతితో మాత్రమే జరగాలంటూ ఆదేశాలిచ్చింది. ఇక, కరోనా వేళ సినిమా ధియేటర్ల యాజమాన్యాల సమస్యలను గత సమావేశంల చిరంజీవి టీం సీఎంకు వివరించారు.

సీఎం ముందు ప్రస్తావించే అంశాలు సిద్దం..
అందుకు సీఎం జగన్ సైతం సానుకూలంగా స్పందించి నిర్ణయాలు తీసుకున్నారు. ఇక, ఇప్పుడు బీ-సీ సెంటర్లలో టిక్కెట్ల ధరల గురించి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా.. ఏపీ ప్రభుత్వం నుంచి సినీ పరిశ్రమకు రాయితీలు-ప్రోత్సాహకాలు కావాలని పరిశ్రమ పెద్దలు కోరుకుంటున్నారు. వీటన్నింటి గురించి సీఎంతో చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటుగా విశాఖలో సినీ పరిశ్రమ డెవలప్ మెంట్ గురించి గత సమావేశంలోనూ సూత్రప్రాయంగా చర్చించారు.

చిరంజీవికి సీఎం జగన్ బాధ్యతలు..
అక్కడ ఉన్న రామానాయుడు స్టూడియో గురించి ప్రభుత్వం ఆ స్థలం వెనక్కు తీసుకుంటుందనే ప్రచారం సాగింది. దీని పైన సురేష్ బాబు అందులో నిజం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే, సినీ సమస్యలకు సంబంధించి అంశాలు ఏవి ఉన్నా మీరే బాధ్యత తీసుకొని తన వద్దకు తీసుకురావాలని చిరంజీవిని స్వయంగా సీఎం జగన్ కోరారు. గతంలో రెండు సార్లు చిరంజీవి అమరావతికి వచ్చి సీఎంతో భేటీ అయ్యారు. తొలి సారి సతీ సమేతంగా రాగా.. రెండో సారి సినీ ప్రముఖులతో కలిసారు.
Recommended Video

బాలయ్య-మోహన్ బాబు మెగా టీంలో ఉంటారా..
ఆ టీంలో సురేష్ బాబు, నాగార్జున, సీ కళ్యాణ్, దిల్ రాజు వంటి వారు ఉన్నారు. అయితే, మోహన్ బాబు - బాలయ్య వంటి వారిని సీఎంతో సమావేశానికి ఆహ్వానించకపోవటం పైన విమర్శలు వచ్చాయి. దీని పైన బాలయ్య ఒక ఇంటర్యూలో కీలక వ్యాఖ్యలు చేసారు. ఇక, ఇప్పడు సీఎం జగన్ తో సెప్టెంబర్ 4 న జరిగే సమావేశానికి బాలయ్య - మోహన్ బాబు వంటి ప్రముఖులు చిరంజీవి టీంలో ఉంటారా లేదా అనే చర్చ ఆసక్తి కరంగా మారుతోంది. ఇక, చిరంజీవి టీం సీఎం జగన్ ముందు ఉంచే ప్రతిపాదనల పైన సీఎం స్పందన ఎలా ఉంటుందనే ఆసక్తి అటు సినీ ఇండస్ట్రీ- ఇటు పొలిటికల్ సర్కిల్స్ లోనూ ఆసక్తి కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications