ముందస్తుగానే సన్నాహాలు పూర్తి చేయండి - సీఎం జగన్..!!
భూసర్వే భవిష్యత్తు తరాలవారికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు సర్వే ప్రక్రియను పూర్తిచేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. జాప్యానికి తావు లేకుండా కావాల్సిన సాంకేతిక పరికరాలను తెప్పించుకోవాలని సీఎం సూచించారు. వైయస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై ముఖ్యమంత్రి సమీక్ష చేసారు. ఈ పథకానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని, ప్రజలకు అత్యంత ఉపయోగకరమైన కార్యక్రమంగా సీఎం జగన్ పేర్కొన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద ఎత్తున భూసర్వే చేపట్టడం లేదన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎవరూ టాంపర్ చేయలేని విధంగా పత్రాలు అందిస్తున్నామని మే 20 నాటికి సర్వే రాళ్లు వేసే పనితోపాటు అన్ని రకాలుగా సర్వే ప్రక్రియ పూర్తిచేయాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. అవసరమైనంతమేర రోవర్లను ఆర్డర్ చేయాలని సూచించారు. దీనివల్ల అనుకున్న సమయానికే సర్వే ప్రక్రియ పూర్తవుతుందని సీఎం వైయస్ జగన్ అన్నారు. రెవెన్యూశాఖ పరిధిలో తొలి దశలో చేపట్టిన 2వేల గ్రామాల్లో సర్వే ప్రక్రియపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి గ్రామ సచివాలయంలో సర్వేకోసం పరికరాలు ఉండాలని సీఎం వైయస్ జగన్ అధికారులను ఆదేశించారు.

రోజుకు 50 వేల సర్వే రాళ్ల చొప్పున సరఫరా చేసేందుకు ప్రణాళిక వేసుకున్నామని అధికారులు వివరించారు. తర్వాత దశల్లో జరిగే సర్వే ప్రక్రియ కోసం రాళ్ల కొరత రాకుండా ముందస్తుగానే సన్నాహాలు చేసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రోవర్ తరహా.. పరికరాలు తప్పకుండా ఉండేలా చూసుకోవాలన్నారు. దీనివల్ల సర్వేయర్ పూర్తిస్థాయిలో తన పనిని పూర్తి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. నిర్దేశించుకున్న టైం లైన్స్ ప్రకారం కచ్చితంగా సర్వే పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏప్రిల్ మూడో వారం నాటికి 300 గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తవుతుందని, డిసెంబర్‌లోగా మొత్తం అన్ని గ్రామాల్లో ఈ సర్వే పూర్తి చేసేదిశగా లక్ష్యాలను పెట్టుకున్నామని పంచాయతీరాజ్ శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.












Click it and Unblock the Notifications