జగన్‌కు మనసెలా ఒప్పింది.. అమరావతి ధ్వంసంపై అచ్చెన్నాయుడు..
అమరావతి రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైతుల నిరసన 600వ రోజుకు చేరాయి. దీంతో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆసక్తికర కామెంట్స్ చేశారు. అమరావతి రైతులకు టీడీపీ అండగా నిలుస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రజల కలను సీఎం జగన్ చెల్లాచెదురు చేశారని ఆరోపించారు. భవిష్యత్‌ను అంధకారం చేస్తోన్న జగన్‌పై ప్రజలు తిరగబడాలని పిలుపునిచ్చారు.

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..
రాజధానిగా అమరావతిని నిండు మనసుతో స్వాగతిస్తున్నానని గతంలో అసెంబ్లీలో జగన్ చెప్పింది నిజం కాదా? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అలాంటిది, అమరావతిని ధ్వంసం చేయడానికి జగన్ కు మనసెలా ఒప్పిందని నిలదీశారు. అటు, టీడీపీ సీనియర్ నేత యనమల స్పందించారు. శాంతియుతంగా దీక్షలు చేస్తున్న రైతులపై ఆంక్షలు విధించడం సరికాదన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం భూములను త్యాగం చేయడమే వారి తప్పా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో పౌరహక్కులు రాజ్యాంగంలోని పేజీలకే పరిమితం అయ్యాయని విమర్శించారు.

600వ రోజుకు చేరిన నిరసనలు
అసెంబ్లీ సాక్షిగా అమరావతిని స్వాగతించిన జగన్, అదే అసెంబ్లీ సాక్షిగా అమరావతిని అడ్డుకుంటున్నారని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. అటు, మీడియాను కూడా అడ్డుకుంటూ పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారని మండిపడ్డారు. జగన్ తన అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇటు అమరావతి ఉద్యమం రోజువారి విధుల్లో భాగమైపోయిందని.. పండగైనా, పుట్టిన రోజు వేడుకలైనా శిబిరాల వద్దే చేసుకుంటున్నామని రైతులు తెలిపారు విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా బదలాయిస్తామంటూ వైఎస్ జగన్ నిండు అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటన వెలువడిన రోజు నుంచే నిరసన కార్యక్రమాలు ఆరంభం అయ్యాయి. సచివాలయం, హైకోర్టు తరలి వెళ్లడం వల్ల తమ భూముల విలువ పడిపోతుందని, ఫలితంగా తాము నష్టపోతామంటూ అమరావతి ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. నిరసన దీక్షలను ఆరంభించగా.. 600వ రోజులకు చేరాయి.

అమరావతే..
అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమం నేటితో 600వ రోజుకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగాలని ముక్తకంఠంతో నినదించారు.. రాజధాని తరలిపోకుండా ఉండాలని రైతులు చేయని ప్రయత్నం లేదు. లాఠీలు విరిగినా, జైళ్లకు వెళ్లినా.. కరోనా భయపెడుతున్నా.. దేన్నీ లెక్కచేయకుండా తమ వారు చేస్తున్న అమరావతి పోరాటం 600వ రోజుకు చేరింది.
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, ముంపు ప్రాంతం అని, కేవలం ఒకే సామాజిక వర్గమే ఉందంటూ వైసీపీ ప్రభుత్వం అసత్య ప్రచారం చేసిందని అచ్చెన్నాయుడు సహా టీడీపీ నేతలు విరుచుకుపడ్డారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా వైసీపీ తప్పుడు ప్రచారాలు ఆగలేదన్నారు. రాజధానిలో రోడ్లు వేసిన కంకరను దొంగతనంగా తవ్వుకుని, హైకోర్టు సమీపంలో ఇసుకను మాయం చేసే స్ధితికి వైసీపీ నేతలు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసెంబ్లీలో ప్రకటన
2019 డిసెంబరు 17న అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన మూడు రాజధానుల ప్రస్తావన.. అమరావతి రైతులకు శరాఘాతంగా మారింది. మరునాటి నుంచే రాజధాని గ్రామాల్లో ఉద్ధృతంగా అమరావతి పరిరక్షణ ఉద్యమం ప్రారంభించారు. డిసెంబరు 18న వెలగపూడిలో తొలి దీక్షా శిబిరం మొదలైంది. అప్పటి నుంచి రాజధాని గ్రామాల ప్రజలు, రైతులు అమరావతే ఆశ, శ్వాసగా పోరాడుతున్నారు. చిన్న పిల్లల నుంచి 70-80 ఏళ్ల వృద్ధుల వరకు రాజధాని పరిరక్షణ ఉద్యమంలో భాగస్వాములు అయ్యారు. రాజధాని గ్రామాల ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి అలుపెరగని పోరాటం చేస్తున్నారు. రాజధాని కోసం రెండేళ్లుగా రైతులు పోరాడుతూనే ఉన్నాయి.
రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు, ఆందోళనలు, రహదారిపై బైఠాయింపు, అసెంబ్లీ ముట్టడి, మౌన ప్రదర్శనలు, ర్యాలీలు, న్యాయపోరాటాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నపాలు... ఇలా తమ బాధ వివరించేందుకు కనిపించిన ఏ మార్గాన్నీ వదలలేదు. దేశ రాజధాని ఢిల్లీ వరకు తమ ఉద్యమ స్వరాన్ని చేర వేశారు.

ఇళ్లలోనూ నిరసనలు
కరోనా సమయంలో ప్రభుత్వం విధించిన నిబంధలకు లోబడి ఇళ్లల్లోనే నిరసన కొనసాగించారు. ప్రైవేటు స్థలాల్లో భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్‌లు ధరించి నిరసనల్లో పాల్గొంటున్నారు. రైతుల ఉద్యమం మొదలయ్యాక రాజధాని గ్రామాల్లోకి ప్రభుత్వం వేల సంఖ్యలో పోలీసుల బలగాల్ని మోహరించింది. 144 సెక్షన్, పోలీసు చట్టంలోని 30 సెక్షన్లను ప్రయోగించి ఉద్యమాన్ని కట్టడి చేయాలని చూసింది.
కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లించుకుని.. గోడు వెళ్లబోసుకునేందుకు బయల్దేరి వెళ్లిన మహిళల్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పోలీసు వలయాన్ని ఛేదించుకుని వెళ్లేందుకు ప్రయత్నించిన వారిపై లాఠీఛార్జ్ చేశారు. రాజధాని రైతులు.. జాతీయ రహదారి దిగ్బంధానికి ప్రయత్నించినపుడు.. వారిపై లాఠీ ఝుళిపించారు. అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన రైతులకూ లాఠీ దెబ్బలు తప్పలేదు. మందడంలో దీక్షాశిబిరం నుంచి నిరసనకారుల్ని వెళ్లగొట్టే ప్రయత్నంలో పోలీసుల దాడిలో ఓ మహిళ తీవ్రంగా గాయపడ్డ విషయం చర్చనీయాంశంగా మారింది.

మోడీ, కోవింద్‌కు లేఖలు..
రాజధాని విషయమై ప్రధాని మోడీ సహా రాష్ట్రపతికి రైతులు మూకుమ్మడి లేఖలు రాశారు. గతంలో విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్తున్న మహిళలపై పోలీసులు విరుచుకపడిన ఘటనలో చాలా మంది గాయపడ్డారు. సీఆర్డీఏ చట్టం రద్దు, 3 రాజధానుల బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. గత ఏడాది జూలై 31న ఆమోదం తెలపడంతో రాజధాని రైతులు ఆందోళన ముమ్మరం చేశారు.
రాజధాని అంశంపై ప్రభుత్వ నిర్ణయాల్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. రాజధాని ఉద్యమంలో ఇప్పటివరకు 3 వేల మందికి పైగా కేసులు నమోదయ్యాయి. ఉద్యమం మొదలయ్యాక ఇప్పటి వరకు సుమారు 170 మంది దాకా రైతులు, కూలీలు వేదనతో మరణించినట్లు అమరావతి జేఏసీ నేతలు తెలిపారు.












Click it and Unblock the Notifications