సీఎం జగన్ తొలి టార్గెట్ కుప్పం : రేపే ముహూర్తం - అభ్యర్ధి ఫైనల్..!!
ముఖ్యమంత్రి జగన్ టార్గెట్ ఫిక్స్. ఇప్పటి వరకు మంత్రులు - ఎమ్మెల్యేలకు లక్ష్యాలను నిర్దేశించిన ముఖ్యమంత్రి..ఇప్పుడు తానే ఇక నియోజకవర్గాల వారీగా ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా.. ప్రతీ నియోజకవర్గం నుంచి సర్వే నివేదికలు సిద్దం చేసుకున్నారు. అక్కడి ప్రస్తుత ఇన్ ఛార్జ్ ల బలాలు - బలహీనతలు.. నియోజకవర్గాల వారీగా ప్రభుత్వం పైన ప్రజాభిప్రాయం..వంటి అంశాలతో ఈ నివేదికలను సిద్దం చేసుకున్నారు. వీటి ఆధారంగా ఒక్కో నియోజకవర్గానికి చెందిన 50 నుంచి 60 మంది కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. రేపటి నుంచి (గురువారం) ఈ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి.

తొలి టార్గెట్ చంద్రబాబు
తొలి రోజు సమావేశం టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంతో ప్రారంభించనున్నారు. ఈ సారి కుప్పం పైన తొలి నుంచి ముఖ్యమంత్రి జగన్ ఫోకస్ పెట్టారు. కుప్పం పరిధిలో జరిగిన స్థానిక సంస్థలు..మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. దీంతో..సీఎం జగన్ లో మరింత పట్టుదల పెరిగింది. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో గెలిచేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయంటూ సీఎం పదే పదే చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో సర్వే నివేదికలతో పాటుగా..స్థానిక పార్టీ కార్యకర్తల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. అక్కడ ప్రతీ గ్రామం నుంచి ప్రాతినిధ్యం ఉండేలా సీఎం వద్దకు వచ్చే కార్యకర్త ల లిస్టు సిద్దం చేశారు. అదే సమయంలో..అభ్యర్ది అంశం పైన సీఎం వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు.

అభ్యర్ధి పైన స్పష్టతకు ఛాన్స్
కుప్పంలో గతంలో రెండు సార్లు పోటీ పడి..మరణించిన చంద్రమౌళి కుమారుడు భరత్ ఇన్ ఛార్జ్ గా ఉన్నారు. ఆయనకు పార్టీ ఎమ్మెల్సీ ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి ఎవరు బరిలో ఉంటారనే దాని పైన పలువురి పేర్లు బయటకు వచ్చాయి. అందులో భాగంగా.. బీసీ వర్గానికి చెందిన ఒక మహిళ ను నిలబెడతారనే చర్చ కూడా పార్టీలో వినిపిస్తోంది. కానీ, కుప్పంలో వైసీపీ గెలుపును వ్యక్తిగత ప్రతిష్ఠగా తీసుకున్న మంత్రి పెద్దిరెడ్డి వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ నుంచి భరత్ పోటీ చేస్తారని తాజాగా వెల్లడించారు. ఈ క్రమంలో ఇప్పుడు నిర్వహిస్తున్న కార్యకర్తల సమావేశాల్లోనే పార్టీ అభ్యర్ధుల అంశం పైన సీఎం అభిప్రాయం తీసుకుంటారని తెలుస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పుడున్న వారే తిరిగి పోటీ చేయటం ఖాయమైన నియోజకవర్గాల్లో..అక్కడి కార్యకర్తల అభిప్రాయం పరిగణలోకి తీసుకొని ఫైనల్ చేయనున్నట్లు సమాచారం.

త్వరలో కుప్పంకు సీఎం జగన్
కుప్పంకు సంబంధించి రేపటి సమావేశంలోనే సీఎం స్పష్టత ఇస్తారని చెబుతున్నారు. త్వరలోనే కుప్పంలో సీఎం జగన్ పర్యటన ఉంటుందని తెలుస్తోంది. అదే విధంగా.. టీడీపీ అభ్యర్ధులు కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ అధినేత చంద్రబాబు అభ్యర్దులు ఎవరనేది వెల్లడించారు. వాటిని సైతం సీఎం జగన్ పరిగణలోకి తీసుకుంటున్నారు. సామాజిక - ప్రాంతీయ సమీకరణాలను లెక్కలోకి తీసుకొని అభ్యర్ధులను ఖరారు చేయనున్నారు. అయితే, అధికారంలోకి వచ్చిన తరువాత ఈ మూడేళ్ల కాలంలో పార్టీ వ్యవహారాల పైన నేతలు - కార్యకర్తలతో సీఎం జగన్ నేరుగా సమావేశాలు నిర్వహించ లేదు. ఇప్పుడు కార్యకర్తలతో ప్రత్యక్షంగా సమావేశాలు ప్రారంభిస్తుండటంతో..పార్టీ శ్రేణుల్లో వీటి పైన ఆసక్తి నెలకొని ఉంది. సీఎం జగన్ ఎన్నికలు - అభ్యర్దుల అంశంతో పాటుగా ఎన్నికల కార్యాచరణ నిర్దేశించే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications