చంద్రబాబు మూలాలే లక్ష్యంగా జగన్ కొత్త వ్యూహం - హిట్ అయితే వార్ ఒన్ సైడే..!!
ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం వై నాట్ 175. కుప్పంలోనూ వైసీపీనే గెలుస్తోంది. ఇదీ పార్టీ నేతలకు పదే పదే చెబుతున్న మాట. 2019 ఎన్నికల్లో జగన్ నమ్ముకున్న నినాదాలు - సోషల్ ఇంజనీరింగ్ భారీ మెజార్టీతో అధికారం దగ్గర చేసాయి. తిరిగి ఇప్పుడు 2019లో ఎవరైతే తనకు అండగా నిలిచారో వారి మద్దతు దూరం కాకుండా జాగ్రత్త పడుతున్నారు. అదే సమయంలో ఓటర్లను తన వైపు నిలబెట్టే వ్యూహాలు - నినాదాలను ఎంచుకుంటున్నారు. తాజా వ్యూహం - కొత్త నినాదం హిట్ అయితే..ఇక వార్ వన్ సైడ్ ఖాయమంటున్నారు వైసీపీ నేతలు.

కడప ఉప ఎన్నికల్లో పవర్ ఫుల్ నినాదం..
వైఎస్సార్ మరణం తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో జగన్ కాంగ్రెస్ వీడి సొంతంగా పార్టీ ఏర్పాటు చేసారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన కడప ఎంపీ పదవికి రాజీనామా చేసారు. వైఎస్సార్ మరణంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన విజయమ్మ తన ఎమ్మెల్సీ పదవి వీడారు. ఇద్దరూ వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి కడప ఎంపీగా జగన్.. పులివెందుల ఎమ్మెల్యేగా విజయమ్మ పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో జగన్ నమ్ముకున్న నినాదం బలంగా పని చేసింది. ఢిల్లీ అహంకారానికి - కడప పౌరుషానికి ఈ ఎన్నిక అంటూ ప్రజల్లోకి వెళ్లారు. అంతే.. కాంగ్రెస్ - టీడీపీ నుంచి సీనియర్లు బరిలో నిలిచారు. నాటి సీఎం కిరణ్.. టీడీపీ అధినేత ఆ ఎన్నికల్లోనే జగన్ ను నిరోధిస్తే తరువాత రాజకీయంగా జగన్ ఎదిగే అవకాశం ఉండదని లెక్కలు వేసారు. కానీ, జగన్ ఒకే ఒక నినాదం తో 5 లక్షల 43 వేల మెజార్టీతో విజయం సాధించి రికార్డులు తిరగరాసారు. అప్పటి నుంచి ప్రజలను ఆకట్టుకోవటంతో జగన్ వ్యూహాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వచ్చారు.

2019 లో నేనున్నాను.. బైబై బాబు
2019 ఎన్నికల వేళ జగన్ పాదయాత్ర తో పాటుగా ప్రధానంగా చంద్రబాబు విశ్వసనీయ దెబ్బ తీయటం పైన ఫోకస్ పెట్టారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయని విషయాన్ని ప్రతీ సభలో ప్రస్తావించారు. వైఎస్సార్ కు ఉన్న విశ్వసనీయత తాను కొనసాగిస్తానని ప్రజల్లో నమ్మకం కలిగించారు. దీంతో, ఆ ఎన్నికల వేళ చంద్రాబు డ్వాక్రా మహిళకు రూ 10 వేలు ఇచ్చినా చంద్రబాబు వైపు మహిళలు నిలబడలేదు. నేను విన్నాను..నేను ఉన్నాను అనే నినాదం ప్రతీ గ్రామానికి తీసుకెళ్లారు. ఏపీలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే సామాజిక సమీకరణాలను వ్యూహాత్మకంగా అమలు చేసారు. టీడీపీ వ్యూహాలకు అందని విధంగా సోషల్ ఇంజనీరింగ్ చేసారు. ఇక 2019 ఎన్నికల్లో షర్మిల ప్రయోగించిన బైబై బాబు ఎన్నికల నినాదం ప్రజల్లోకి చొచ్చుకెళ్లింది. జగన్ తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ అభ్యర్దించటం ఓట్లుగా మార్చింది. దీంతో, ఆర్దికంగా ఎన్ని కష్టాలు వచ్చినా.. విమర్శలు ఎదురైనా జగన్ తన హామీలను నిలబెట్టుకుంటూ గెలిచిన తొలి నాటి నుంచే 2023 ఎన్నికలకు తన ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు. ఇప్పుడు దాదాపు రెండు కోట్ల మంది పెన్షన్లు..సంక్షేమ పథకాల లబ్ది దారుల వద్దకు నిత్యం జగన్ ఎంపిక చేసుకుకన జగనన్న సైన్యం వెళ్లి 2024 ఎన్నికల్లో మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది.

పేదలకు - పెత్తందార్లకు మధ్య యుద్దంగా
ఇక, వచ్చే ఎన్నికలకు సిద్దం అవుతున్న సీఎం జగన్ తన లక్ష్యం స్పష్టం చేసారు. ఎవరు ఎన్ని పొత్తులతో వచ్చినా తాను సింగిల్ గానే పోటీ చేస్తానని జగన్ ప్రకటించారు. అదే సమయంలో ఈ ఎన్నికలు కులాల మధ్య కాదని తేల్చి చెప్పారు. తాను నమ్ముకున్న పేదలకు - చంద్రబాబు నమ్ముకున్న పెత్తందార్లకు మధ్య ఎన్నికగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సంక్షేమ పథకాలు దాదాపు 87 శాతం మంది ప్రజలు అందుకుంటున్నారు. వారికి పథకాలు అందాలన్నా..పేదలకు మంచి జరగాలన్నా తాము అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందంటూ ఇప్పటి నుంచే వారికి అర్దమయ్యేలా వివరిస్తున్నారు. ఒక వేళ పొరపాటున తాము అధికారంలోకి రాకపోతే ఏ ఒక్క పేదవాడికి న్యాయం జరగదంటూ జగన్ చెప్పుకొస్తున్నారు. ఈ నినాదం..వ్యాఖ్యలు ఖచ్చితంగా పథకాల ద్వారా లబ్ది పొందుతున్న వారి మనసులను తాకుతుందని..జగన్ వైపు వారంతా నిలచేలా చేస్తుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయరని..తాను చెబితే ఖచ్చితంగా చేస్తానని ఈ నాలుగేళ్ల కాలంలో అమలు చేసిన పథకాలను ప్రస్తావిస్తున్నారు. ఫలితంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు తన వారని చెబుతూ..పేదల పక్షాన తాను ఉన్నాననే ఎటాచ్ మెంట్ ఏర్పరచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు పెత్తందార్ల కు మద్దతు గా నిలుస్తారని విమర్శిస్తున్నా..ఇప్పటి వరకు ఆ పార్టీ నుంచి స్పందన లేదు. మెజార్టీ ఓటింగ్ కూడా వారిదే ఎక్కువగా ఉండటంతో..జగన్ నినాదం బలంగా పని చేస్తే అధికారం ఖాయమని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications