సర్వే నివేదికలు సిద్దం - సీఎం జగన్ కొత్త స్కెచ్..!!
ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల దిశగా కీలక అడుగులు వేస్తున్నారు. పక్కా స్కెచ్ తో రూట్ మ్యాప్ సిద్దం చేస్తున్నారు. ఈ రోజు పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం ఏర్పాటు చేసారు. రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ భేటీ కీలకం కానుంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువాత టీడీపీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తో ముందుకు వెళ్తున్న సమయం..నలుగురు ఎమ్మెల్యేలపై వైసీపీ వేటు వేసిన వేళ సీఎం జగన్ పార్టీ నేతలతో తన ఆలోచనలను షేర్ చేసుకోనున్నారు. సర్వే నివేదికలతో సహా..పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు.
పార్టీ నేతలతో సీఎం జగన్ సమావేశం
ముఖ్యమంత్రి జగన్ పార్టీ నేతలతో సమావేశం రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ మెజార్టీ స్థానాలు గెలిచినా.. టీడీపీ గెలిచిన నాలుగు పట్టభద్రుల స్థానాలు.. ఎమ్మెల్యే కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానం తరువాత సమీకరణాల్లో మార్పు కనిపిస్తోంది. టీడీపీ ఈ గెలుపును తమకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తోంది. ఎన్నికల్లో తమదే విజయం అంటూ ప్రచారం ప్రారంభించింది. వై నాట్ 175 అంటూ ఇప్పటి పార్టీ నేతల్లో ఆత్మ విశ్వాసం పెంచిన సీఎం జగన్..ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ నేతలకు స్పష్టమైన రూట్ మ్యాప్ ఖరారు చేయనున్నారు. గతంలో సర్వే నివేదికల ఆధారంగా ఎమ్మెల్యేల పనితీరు ..మెరుగు పర్చుకోవాల్సిన అంశాల పైన మార్గనిర్దేశనం చేసారు.

ఎమ్మెల్యేల పని తీరుపై నివేదికలు
ఈ రోజు జరిగే సమావేశంలోనూ ఎమ్మెల్యేల పని తీరును సీఎం మరోసారి ప్రస్తావించే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలుపు అంశాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించి..ఎటువంటి అంశాల ప్రాతిపదికన ఫలితాలు వచ్చిందీ పార్టీ నేతలతో షేర్ చేసుకొనే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో నలుగురు పార్టీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన అంశం పైన సీఎం ఏ రకంగా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల నియోజకవర్గంలో ఇప్పటికే కొత్త ఇంఛార్జ్ లను నియమించారు. వారితో మరో ఇద్దరు జత కలిసి క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ పార్టీ నుంచి సస్పెండ్ చేసారు. ఆ ఇద్దరి నియోజకవర్గాల్లోనూ కొత్త ఇంఛార్జ్ ల నియమకానికి రంగం సిద్దం చేసారు. వారికి టికెట్లు నిరాకరణ..సీట్లు దక్కని వారి సేవలను ఎలా వినియోగించుకంటామనే అంశం పైన సీఎం జగన్ స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఎన్నికలకు రూట్ మ్యాప్
ఇక, కొద్ది రోజులుగా ఏపీలో మంత్రివర్గ విస్తరణ పైన ప్రచారం సాగుతోంది. సీనియర్లు అవకాశమే లేదని కొట్టి పారేస్తున్నారు. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం స్వయంగా పని తీరు సరిగ్గా లేని మంత్రుల మార్పు తప్పదనే సంకేతాలు ఇచ్చారు. ఈ అంశం పైన సీఎం జగన్ స్పష్టత ఇవ్వనున్నారు. టీడీపీ చేస్తున్న ప్రచారం..రానున్న ఎన్నికలకు మార్గనిర్దేశనంతో పాటుగా పక్కా రూట్ మ్యాప్ పార్టీ నేతలకు సీఎం నిర్దేశించనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇంకా పని తీరు మెరుగుపర్చుకోవాల్సిన ఎమ్మెల్యేల విషయంలో ఏం చెప్పబోతున్నారనేది ఉత్కంఠను పెంచుతోంది. కొందరు ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉందనే ప్రచారం పైన ముఖ్యమంత్రి స్పందిస్తారా.. ఏం హామీ ఇవ్వబోతున్నారనేది ఈ రోజు సమావేశంలో ఆసక్తిగా మారుతోంది.












Click it and Unblock the Notifications