మూడు రాజధానులకు దూరంగా జగన్..!! స్వాతంత్ర్య దినోత్సవం నాడు : ఆ నిర్ణయం వెనుక..!!
దేశ వ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏపీలోనూ అదే తరహాలో కొనసాగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం విజయవాడలో స్వాత్రంత్య దినోత్సవ వేడుకలను నిర్వహించింది. సీఎం జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించి కీలక ప్రసంగం చేసారు. తన ప్రభుత్వం ఈ 26 నెలల కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి.. ప్రజారంజకమైన పాలనను అందిస్తున్నామని జగన్ చెప్పుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు మేలు జరిగేలా ప్రభుత్వం చూస్తోందన్నారు. వ్యవసాయ రంగంపై రూ. 83 వేల కోట్లు వ్యయం చేశామన్న విషయాన్ని ఈ సందర్భంగా జగన్ తెలిపారు.
Recommended Video

ఉద్యోగులకు చాలా చేస్తున్నాం..
చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా రాష్ట్ర గతిని మారుస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని సీఎం అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి ఏమేం చేసింది..? అనేదానితో పాటు పలు విషయాలపై నిశితంగా మాట్లాడారు. ముఖ్యంగా.. ఉద్యోగుల సంక్షేమం గురించి ప్రత్యేకించి మరీ తన ప్రసంగంలో జగన్ వివరించారు. అయితే, ఉద్యోగుల సమస్యల పైన కొద్ది రోజులుగా ఏపీలో చర్చ సాగుతోంది. ఆ అంశం పైన జగన్ ఒక్క మాటతోనే ముగింపు ఇచ్చారు. ఉద్యోగులకు ఈ ప్రభుత్వం చాలా చేస్తోందని చెప్పుకొచ్చారు.

ఆర్దిక ఆరోపణలుకు ఒక్క మాటలో సమాధానం..
ఇక, ఏపీ ప్రభుత్వం ఆర్దికంగా అనేక అవకతవకలకు పాల్పడుతోందంటూ వస్తున్న విమర్శలకు మాత్రం సీఎం జగన్ సమాధానం ఇచ్చారు. తాము ఖర్చు చేసే ప్రతీ రూపాయిని రేపటి భవిష్యత్ కోసం బాధ్యతతో ఖర్చు చేస్తున్నామని వివరించారు. ఈ రోజు కంటే రేపు బాగుండాలనే ఉద్దేశంతోనే తాము ప్రతీ ఒక్కరి సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకొని పని చేస్తున్నామన్నారు. అయితే, ఈ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఒక ఆసక్తి కర పరిణామం చోటు చేసుకుంది.

మూడు రాజధానుల ప్రస్తావన ఏదీ..
2019 డిసెంబర్ నుంచి ముఖ్యమంత్రి జగన్..మంత్రులు మూడు రాజధానుల అంశాన్ని ప్రతీ సందర్భంలోనూ చెబుతూ వచ్చారు. ఆగస్టు 15-జనవరి 26-బడ్జెట్ సమయంలో గవర్నర్ ప్రసంగాల్లోనూ ఈ మూడు రాజధానుల అంశాన్ని పదే పదే చెబుతూ వచ్చారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. అయినా..ముందుకే వెళ్లాలని జగన్ భావించినా, కరోనా కారణంగా అడ్డంకి ఏర్పడింది. అయితే, సడన్ గా ముఖ్యమంత్రి చేసిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో మాత్రం మూడు రాజధాను అంశం లేదు.

ఉద్దేశ పూర్వకంగానా... లేక, అవసరం లేదనా..
ఇప్పుడు ఇది రాజకీయంగా హాట్ టాపిక్ గా మారుతోంది. ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రస్తావన తీసుకురాలేదా..లేక, ప్రతీ సందర్బంలో చెబుతున్న అంశమే కదా అనే కారణంగా ప్రస్తావించలేదా అనేది ప్రభుత్వ వర్గాల్లోనే స్పష్టత లేదు. కానీ, పరోక్షంగా తాను మూడు రాజధానుల గురించి నిర్ణయం తీసుకోవటం వెనుక ఉన్న కారణం మాత్రం జగన్ చెప్పుకొచ్చారు. తాను చేసిన పాదయాత్రలో ప్రజా సమస్యలు విన్నానని.. వారు ఏం కోరుకున్నారో స్వయంగా చూశానన్నారు. పరిపాలన అంటే ఒక నగర కేంద్రం ఉంటుందన్న భావన పోవాలని ప్రజలు కోరుకున్నారని వివరించారు.

ముందుకే..వెనకడుగు లేదంటూనే..
ఇప్పటికే ఇదే అంశం మీద మంత్రులు సైతం పలు మార్లు స్పందించారు. మూడు బిల్లుల ఆమోదంతోనే మూడు రాజధానుల వ్యవహారం నిర్ణయం జరిగిపోయిందని.. కోర్టుల్లో ఉన్న కేసులు పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తామని చెబుతూ వచ్చారు. ఇందులో భాగంగా ముందుగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం విశాఖలో ఏర్పాటు చేయాలనే భావనలో ప్రభుత్వం ఉంది. అదే విధంగా కర్నూలు న్యాయ రాజధాని ప్రకటన తరువాత ఇప్పుడు అక్కడ మానవ హక్కుల సంఘం, లోకాయుక్త కార్యాలయాల ఏర్పాటుకు రంగం సిద్దం చేస్తున్నారు.
అయితే, జగన్ ప్రధాన ప్రాధాన్యత అంశమైన ఈ మూడు రాజధానుల వ్యవహారం ఆగస్టు 15న ప్రసంగంలో ఆయన నోటీ నుంచి మరోసారి ప్రస్తావించకపోవటం పైన మాత్రం వైసీపీ నేతలే ఆశ్చర్యపోతున్నారు.












Click it and Unblock the Notifications