సీఎం జగన్ ఇక విశాఖ నుంచే - అమరావతిలో ఇలా..!!
విశాఖ నుంచి పాలన పైన ముఖ్యమంత్రి ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ఏపీకి పాలనా రాజధాని విశాఖే. ఏపీ ప్రభుత్వంలోని ముఖ్యులు పదే పదే చెబుతున్న మాట. కానీ, న్యాయ పరమైన చిక్కులతో అధికారికంగా విశాఖ నుంచి పాలనకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. అమరావతి కేసు ప్రస్తుతం సుప్రీంలో పెండింగ్ లో ఉంది. ఈ నెల 28న విచారణకు రానుంది. ఇటు అధికార వైసీపీ ఎన్నికలకు సమాయత్తం అవుతోంది.
తాను త్వరలో విశాఖకు షిఫ్ట్ అవుతున్నట్లు ముఖ్యమంత్రి ఇప్పటికే స్పష్టం చేసారు. అటు న్యాయస్థానంలో కేసు..ఇటు కొత్త విద్యా సంవత్సరం..అటు ఎన్నికలు..ఈ సమయంలోనే విశాఖ నుంచి పాలన పైన ముఖ్యమంత్రి ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

ఏప్రిల్ నుంచి విశాఖలో సీఎం జగన్
ఈ నెల 14 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 17న ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టనుంది. ఈ నెల 27వ తేదీ వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. సుప్రీంకోర్టులో రాజధానుల వ్యవహారం కొలిక్కి వస్తే ఈ సమావేశాల్లోనే బిల్లు ప్రతిపాదించి ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావించింది.
కానీ, సుప్రీంలో విచారణ ఆలస్యం కానుండటంతో ఈ సమావేశాల్లో విశాఖ నుంచి పాలన పైన తమ వైఖరి స్పష్టం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి సభలో ప్రకటనకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఈ నెల 28, 29 తేదీల్లో విశాఖలో జీ 20 సన్నాహక సదస్సు జరగనుంది. ఆ తరువాత విశాఖలోనే ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయం ప్రారంభించి..అక్కడ నుంచే పాలన కొనసాగించేలా నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

సాగర తీరంలో పాలన..
ఏప్రిల్ 14 డా బీఆర్ అంబేద్కర్ జన్మదినం నాడు విజయవాడలో 125 అడుగులు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అదే రోజు విశాఖ నుంచి సీఎం జగన్ క్యాంపు కార్యాలయం ప్రారంభించేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు సమాచారం.సుప్రీంకోర్టులో కేసు విషయంలోనూ ఈ నెల 28న విచారణ వేళ కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
కోర్టులో త్వరగానే తీర్పు వస్తే అప్పటి వరకు వేచి చూడటం.. కోర్టు లో సమయం తీసుకుంటే తమ ముందున్న ప్రత్యామ్నాయ మార్గాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలనేది ప్రభుత్వ ఆలోచన. ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పాలన చేసే అవకాశం ఉండటంతో.. విశాఖలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకొని..అక్కడ నుంచే నిత్య పాలనా వ్యావహారాలతో పాటుగా మంత్రివర్గ సమావేశాలు ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

అమరావతిలో రెండు రోజులు
విశాఖలో సీఎం జగన్ పాలనా వ్యవహారాలను ప్రారంభిస్తే వారంలో రెండు రోజులు అమరావతిలో ఉంటారని తెలుస్తోంది. ప్రతీ శని, ఆది వారాలు సీఎం జగన్ అమరావతిలో అందుబాటులో ఉంటారని చెబుతున్నారు. దీనికి సంబంధించి అసెంబ్లీ వేదికగా స్పష్టత ఇచ్చేందుకు రంగం సిద్దం అవుతోంది. సుప్రీంకోర్టులో పరిష్కారం వస్తే వచ్చే జూన్ లో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం నుంచే విశాఖలో పూర్తి స్థాయి పాలన ప్రారంభించే అవకాశం ఉంది.
సుప్రీంలో తీర్పు తమకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వంలోని ముఖ్యులు అశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే కేసును త్వరిత గతిన విచారణ చేయాలంటూ ప్రభుత్వం కోరుతోంది. ఇదే సమయంలో విశాఖ నుంచి సీఎం జగన్ తన పాలన ప్రారంభించేందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంద. మూడు రాజధానులు..విశాఖ నుంచి పాలన పైన ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది.












Click it and Unblock the Notifications