సీఎం జగన్ విశాఖ కేంద్రంగా - రాజకీయంగా కలిసొచ్చేనా..!!
ఏపీలో ఇప్పుడు మరోసారి మూడు రాజధానుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అమరావతి రైతులు ఈ నెల 12వ తేదీ నుంచి మలి విడత పాదయాత్రకు నిర్ణయించారు. పోలీసు అధికారులు అనుమతి నిరాకరించినా.. కోర్టు అనుమతి ఇచ్చింది. ఇదే సమయంలో అమరావతికి మద్దతుగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో వైసీపీ మంత్రులు విభేదించారు. ఇంకా అమరావతి ప్రాంత వాసులను చంద్రబాబు మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులకు కట్టుబడి ఉందని పలువురు మంత్రులు చెప్పుకొచ్చారు.

మూడు రాజధానులపై మరోసారి
మూడు రాజధానుల వ్యవహారం పైన గతంలోనే ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. న్యాయస్థానంలో కేసుల కారణంగా మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ఉప సంహరించుకుంది. ఈ ఏడాది మార్చిలో అమరావతికి అనుకూలంగా హైకోర్టు తీర్పపు ఇచ్చింది. ఆ తరువాత ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ తీర్పు పైన రివ్యూ లేదా సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసినట్లుగా అధికారికంగా సమాచారం లేదు.
హైకోర్టులో ప్రభుత్వ ఏజీ మాత్రం ఇదే అంశం పైన న్యాయ సలహాలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ముక్తకంఠంతో అమరావతికి మద్దతుగా నిలిచారు. వైసీపీ మాత్రం మూడు రాజధానుల నిర్ణయం నుంచి వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేస్తోంది. త్వరలోనే మరోసారి అసెంబ్లీలో బిల్లు తీసుకొస్తామని చెబుతోంది.

విశాఖ నుంచి సీఎం పాలన..
ఇదే సమయంలో న్యాయపరమైన చిక్కులు పరిష్కారం కాకుంటే.. ముఖ్యమంత్రి జగన్ విశాఖ నుంచి పాలన సాగించేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. విశాఖలోని రుషికొండ వద్ద ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం పూర్తి చేసుకొని..అక్కడి నుంచి పాలనా వ్యవహారాలు పర్యవేక్షించేలా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయని తెలుస్తోంది. సచివాలయం ఇప్పటికిప్పుడు తరించేందుకు న్యాయపరమైన సమస్యలు ఉండటంతో, వాటిని పరిష్కరించుకొని ముందుకు వెళ్లాలనేది ప్రభుత్వ ఆలోచన.
అయితే, అసెంబ్లీ మాత్రం అమరావతి కేంద్రంగానే కొనసాగనుంది. హైకోర్టు ను కర్నూలు తరలించాలనే ప్రతిపాదన ఉన్నా.. అక్కడా న్యాయ పరమైన అంశాలు ముడి పడి ఉన్నాయి. దీంతో.. విశాఖలో క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ పాలన ప్రారంభించేందుకు రంగం సిద్దం అవుతుందని తెలుస్తోంది.

అసెంబ్లీ సమావేశాల్లో క్లారిటీ
ఇక, రైతులు ఇప్పుడు అమరావతి టు అరసవల్లి పేరుతో ప్రారంభిస్తున్న పాదయాత్రను ఉత్తరాంధ్ర పైన దండయాత్రగా మంత్రులు అభివర్ణిస్తున్నారు. అమరావతి ప్రాంతంలో కేవలం 29 గ్రామాలకు సంబంధించి కాకుండా.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తమ పైన ఉందని చెబుతున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే మరోసారి మూడు రాజధానుల బిల్లు ప్రవేశ పెడతామని చెబుతున్నా.. న్యాయ పరమైన సమస్యలు పరిష్కారం కాకుండా ప్రవేశ పెట్టే అవకాశం లేదు. దీంతో..ఈ సమావేశాల్లో ఈ మూడు రాజధానుల అంశం పైన చర్చకు మాత్రం అవకాశం ఉంది. ఇదే సమయంలో సీఎం విశాఖ నుంచి పాలన ప్రారంభించే అంశం పైన క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది.












Click it and Unblock the Notifications