మహిళలకు సీఎం జగన్ మరో గుడ్ న్యూస్ - రూ 30 లక్షల టర్నోవర్..!!
ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మహిళల కోసం అమలు చేస్తున్న పథకాలతో పాటుగా కొత్తగా అధికారులకు మరో సూచన చేసారు. చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం లాంటి పలు పథకాల ద్వారా మహిళలకు జీవనోపాధి కల్పించే మార్గాలను మరింత విస్తృతం చేయాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. తాజాగా స్వయం సహాయక సంఘాల మహిళలతో సూపర్ మార్కెట్‌లు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. నెలకు రూ.30 లక్షలు టర్నోవర్ లక్ష్యంగా ఏర్పాటు చేయనున్నారు.
ముఖ్యమంత్రి నిర్ణయం:ముఖ్యమంత్రి జగన్ డ్వాక్రా మహిళలకు సంబంధించి మరో నిర్ణయం ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులను మార్కెట్ ధర కంటే తక్కువకే అందించాలన్న లక్ష్యంతో స్వయం సహాయక సంఘాల మహిళలతో సూపర్ మార్కెట్‌లు ఏర్పాటు చేయాలని జగన్ ఆదేశించారు. జిల్లాకు కనీసం రెండు సూపర్ మార్కెట్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. మహిళల స్వయం సాధికారితకోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. చేయూత కింద అర్హత సాధించిన లబ్ధిదారులకు వరుసగా నాలుగేళ్లపాటు క్రమం తప్పకుండా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని సీఎం చెప్పుకొచ్చారు. అలానే ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పథకాల కింద కూడా నిర్ణయించిన వ్యవధి మేరకు క్రమం∙తప్పకుండా వారికి ఆర్థిక సహాయం అందుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

మహిళా సూపర్ మార్కెట్లు:ఇప్పటివరకూ చేయూత పథకం ద్వారా 9 లక్షలమంది స్వయం ఉపాధి పొందుతున్నారని అధికారులు వెల్లడించారు. హిందుస్తాన్ యూనీలీవర్, ఐటీసీ లిమిటెడ్, రిలయెన్స్, అజియో, జీవీకే, మహేంద్ర, కాలాగుడి, ఇర్మా, నైనా, పీ అండ్ జీ వంటి అంతర్జాతీయ సంస్ధలతో ఇప్పటికే ఒప్పందాలు జరిగాయని అధికారులు నివేదించారు. ఈ కార్యక్రమం ద్వారా చేయూత మహిళా మార్టు, వస్త్ర, చింతపండు ప్రాసెసింగ్ యూనిట్, లేస్ పార్కు, ఇ- కామర్స్, ఇ-మిర్చ, బ్యాక్ యార్డు పౌల్ట్రీ, ఆనియన్ సోలార్ డ్రయ్యర్లు ఏర్పాటు వంటి కార్యక్రమాలను చేపడుతున్నట్టు అధికారులు వివరించారు. కాకినాడ జిల్లాలో సామర్లకోటలో వస్త్ర పేరుతో దుస్తుల తయారీ యూనిట్..చిత్తూరు జిల్లా కురుబలకోటలో చింతపండు ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు గురించి వివరిస్తూ, మూడు వేల కుటుంబాలకు చేయూత అందినట్లు చెప్పుకొచ్చారు.
ప్రతీ జిల్లాలో రెండు ప్రారంభం:స్వయం సహాయక సంఘాల మహిళలతో జిల్లాకు కనీసం రెండు సూపర్ మార్కెట్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొత్తం 27 చేయూత మహిళా మార్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఒక్కో సూపర్ మార్టులో కనీసం నెలకు రూ.30 లక్షలు టర్నోవర్ లక్ష్యంగా ఏర్పాటుకు డిసైడ్ అయ్యారు. వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు డోర్ డెలివరీ, ఆన్‌లైన్ బుకింగ్, వాట్సప్ బుకింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తున్నామని అధికారులు వివరించారు. మల్టీ నేషన్ కంపెనీలతో భాగస్వామ్యం వల్ల వారి ఉత్పత్తుల్లో కనీసం 8 నుంచి 25 శాతం మార్జిన్ ఉండేట్టు ఏర్పాటు చేస్తున్నారు. ట్రెండ్స్, అజియో వంటి కంపెనీలతో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. ఈ తాజా నిర్ణయం ద్వారా మహిళలకు ప్రభుత్వ మద్దతుతో కొత్తగా మరో పోటీ రంగంలోకి అడుగు పెట్టనున్నారు.












Click it and Unblock the Notifications