ఎవరికీ భయపడను, నా ధైర్యానికి కారణం అదే - సీఎం జగన్..!!
వచ్చే ఎన్నికల్లో తోడేళ్లు ఏకం అయినా..సింహం సింగిల్ గానే వస్తుందని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. తనకు ప్రజలతో మినహా మరెవరితోనూ పొత్తులు ఉండవని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల కురుక్షేత్రం లో అందరూ ఏకమై ప్రజలను మోసం చేసేందుకు అడుగులు వేస్తారని అప్రమత్తం చేసారు. ఈ ప్రభుత్వంలో మీకు మంచి జరిగిందా లేదా అనేదే కొలమానంగా తీసుకొని నిర్ణయానికి రావాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు.
ఇదే నా ధైర్యం
ఏలూరు జిల్లా నూజివీడులో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46,463.82 ఎకరాలను వ్యవసాయం కోసం కొత్తగా 42,307 మందికి డీకేటీ పట్టాలు పంపిణీ చేశారు. ఎన్నికల్లో తాను సింహం లాగా ఒంటరిగానే ముందుకొస్తానని..ఎవరితోనూ పొత్తులు ఉండవని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేసారు.

మీ బిడ్డకు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా..ఈ ధైర్యం మీ దగ్గరి నుంచే వచ్చింది. దేవుడిని నమ్ముతాను, మీ ఆశీస్సులపై ఆధారపడుతాను. ఇవే మీ బిడ్డకు ధైర్యం అంటూ జగన్ చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో అబద్ధాలు ఎక్కువవుతాయి, మోసాలు ఎక్కువవుతాయి. ఇదే చంద్రబాబు నోట్లో నుంచి, ఆయన గజదొంగల ముఠా, దత్తపుత్రుడు అందరూ ఏకమై ప్రజలను మోసం చేసేందుకు అడుగులు వేస్తారని జగన్ పేర్కొన్నారు.
కుట్రలు చేతకాదు
వాళ్ల మాదిరిగా అబద్ధాలు చెప్పడం తనకు చేతకాదని..కుట్రలు చేయడం చేతకాదన్నారు. కుతంత్రాలు పన్నడం అంతకన్నా చేతకాదని..మీ బిడ్డ మోసం చేయడని జగన్ వివరించారు. అబద్ధాలు ఆడడన్నారు. ఇది మాత్రం కచ్చితంగా గుర్తు పెట్టుకోండని జగన్ కోరారు. రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపించామని, 2003 నాటి అసైన్డ్ భూములకు హక్కు కల్పిస్తున్నామన్నారు.
కొత్తగా డీకేటి పట్టాలను అందిస్తున్నాం. పేదవాళ్లకు వెన్నుదన్నుగా ఉంటే పెత్తందార్లకు నచ్చడం లేదన్నారు. పేదవర్గాల పట్ల బాధ్యతగా చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నామన్నారు. మొదటి దశలో 18లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశాం. రెండో దశలో 24.6 లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశామని ముఖ్యమంత్రి వివరించారు.
మంచి జరిగితేనే
ఈ 53 నెలల పాలనలోనే డీబీటీ ద్వారా రూ.2.40 లక్షల కోట్లు నేరుగా అందిస్తే..నాన్ డీబీటీ ద్వారా రూ.1.70 లక్షల కోట్లు అందించామని సీఎం చెప్పారు.మొత్తంగా రూ.4.10 లక్షల కోట్లు నా పేదల కోసం ఇవ్వగలిగామని చెప్పడానికి గర్వపడుతున్నట్లు వెల్లడించారు. ఈ రోజు రూ.4.10 లక్షల కోట్లుకు గాను ఇందులో దాదాపు 80 శాతం ప్రయోజనం ఈ పేద వర్గాలకే ఇచ్చామని వివరించారు.
చంద్రబాబు ఏనాడు కూడా ప్రజలకు మంచి చేసి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోలేదని చెప్పారు. తాను తీసుకొచ్చిన మంచి స్కీముల వల్లనో, లేక తాను చేసిన మంచి పనుల వల్లనో ఈ బాబు ఏనాడు కూడా సీఎం కాలేదని చెప్పుకొచ్చారు. 2014 నుంచి 2019 వరకు ఐదేళ్ల కాలంలో చంద్రబాబు ఎంత మందిని మోసం చేశారో చూశాం. ఇవన్నీ గుర్తుకు తెచ్చుకోండని జగన్ సూచించారు.












Click it and Unblock the Notifications