సీఎం జగన్ మార్క్ నిర్ణయం - ఓట్ బ్యాంక్ లెక్క పక్కా..!!
ఎన్నికల ఏడాదిలో సీఎం జగన్ మార్క్ నిర్ణయాలు మొదలయ్యాయి.
ఎన్నికల ఏడాదిలో సీఎం జగన్ మార్క్ నిర్ణయాలు మొదలయ్యాయి. ప్రతీ ఇంటి అందిస్తున్న సంక్షేమం తమను తిరిగి గెలిపిస్తుందనేది వైసీపీ నేతల ధీమా. ఇప్పుడు బుగ్గన బడ్జెట్ పద్దుల్లోనూ లెక్క పక్కాగా కనిపిస్తోంది. ఏపీ వార్షిక బడ్జెట్ 2023 -24 ను ఆర్దిక మంత్రి బుగ్గన అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఇందులో సంక్షేమానికి పెద్ద పీట వేసారు. అటు రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధిపరంగా దేశంలోనే ఏపీ నంబర్ వన్ గా నిలిచినట్లు బడ్జెట్ లో స్పష్టం చేసారు. సుస్థిర అభివృద్ధి, సుపరిపాలన అనే సూత్రాలతో ముందుకు వెళ్తున్నట్లు ప్రకటించారు. డీబీటీ స్కీంలకు రూ.54,228.36 కోట్లు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయంగానూ ఆసక్తిగా మారింది.

ఎన్నికల ఏడాదిలో వ్యూహాత్మక బడ్జెట్
వైసీపీ ప్రభుత్వం ప్రస్తుత హయాంలో పూర్తి స్థాయి చివరి బడ్జెట్ ను ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. రూ.2 లక్షల 79వేల 279 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్ ను ఆర్దిక మంత్రి బుగ్గన ప్రతిపాదించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ బడ్జెట్ ప్రతిపాదిస్తున్నట్లు వెల్లడించారు. తమ మేనిఫెస్టో అమలుకు ప్రాధాన్యతను వివరించారు. పేదలకు అండగా నిలిచే సంక్షేమ పథకాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. అన్ని వర్గాల సంక్షేమంతో పాటు సమగ్రాభివృద్ధే లక్ష్యమని స్పష్టం చేసారు. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న నవరత్నాలకు కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్ర వర్ణాల్లోని పేదలకు..మహిళలకు సంబంధించిన పథకాలకు నిధులను పెంచారు. ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలకు ప్రత్యేకంగా కేటాయింపులు చేసారు.
డీబీటీ స్కీంలకు రూ.54,228.36 కోట్లు
ముఖ్యమంత్రి జగన్ పదే పదే తమ హాయంలో ప్రతీ ఇంటికి జరిగిన మేలు గురించి ప్రస్తావన చేస్తున్నారు. ప్రతీ ఇంటికి మేలు జరిగిందని భావిస్తేనే తనకు మద్దతుగా నిలవాలని ఓపెన్ గానే చెబుతున్నారు. తమది పేదల పక్షాన నిలిచే ప్రభుత్వమని స్పష్టం చేస్తున్నారు. పెత్తందార్లకు వ్యతిరేక పోరాటమని నినదించారు. ఇప్పుడు బడ్జెట్ కేటాయింపుల్లోనే అదే ప్రాధాన్యత కొనసాగించారు. పథకాల అమల్లో ఎలాంటి వివక్ష..అవినీతికి తావు లేకుండా అందిస్తున్న పథకాలను వైసీపీ ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది బడ్జెట్ లోనే ఈ పథకాలకు నిధులను అదే స్థాయిలో కేటాయించారు. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా స్కీంలకు రూ 54,228.36 కోట్లను బడ్జెట్ లో ప్రతిపాదించారు. అందులో భాగంగా వైఎస్సార్ పెన్షన్ కానుక కింద రూ. 21,434.72 కోట్లను కేటాయించారు. జగనన్న విద్యాదీవెన రూ.2,841.64 కోట్లు.. జగనన్న వసతి దీవెన- రూ.2,200 కోట్లు కేటాయిస్తూ బడ్జెట్ లో ప్రతిపాదనలు చేసారు.













Click it and Unblock the Notifications