ముఖ్యమంత్రి జగన్ మైండ్‌గేమ్: టీడీపీ-జనసేన పొత్తుకోసం ఎదురుచూపులు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మరో వ్యూహానికి తెరతీశారు. జనసేనాని పవన్‌కల్యాణ్‌ను దత్తపుత్రుడు, దత్తపుత్రుడు అంటూ పదే పదే వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అదంతా ఆయన మైండ్‌గేమ్‌లో భాగమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను పరిశీలించినా జగన్ ప్రణాళిక ఏమిటో స్పష్టంగా అర్థమవుతుందటున్నారు.

బీజేపీ లేకుండా టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకోవాలి?
ముఖ్యమంత్రి జగన్ ప్రణాళిక ప్రకారం రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు పెట్టుకోవాలి. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవాలంటే జనసేన భారతీయ జనతాపార్టీని వదిలేయాలి. ఆ పార్టీతో మిత్రపక్షంగా అంటకాగినంతకాలం పొత్తుకు అవకాశం లేదు. బీజేపీ తన మనసు మార్చుకొని చంద్రబాబునాయుడితో పొత్తు పెట్టుకోవడానికి ముందుకు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
జగన్ ప్రణాళిక ప్రకారం బీజేపీని కాకుండా తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తుపెట్టుకుంటే పోటీచేసే ప్రతిపక్షాల సంఖ్య ఎక్కువవుతుంది. ఎన్నికల్లో వైసీపీకి అదే కలిసివస్తుందని జగన్ భావిస్తున్నారు.

ఇతర పార్టీలన్నీ విడివిడిగా పోటీచేయాలి?
వైసీపీ ఒకవైపు, తెలుగుదేశం-జనసేన మరోవైపు, బీజేపీ విడిగా, కాంగ్రెస్ విడిగా, వామపక్షాలు విడిగా పోటీచేస్తాయి. దీనివల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం ఉంటుందని జగన్ అంచనా వేస్తున్నారు. అలాకాకుండా రెండు లేదా మూడు పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడి పోటీచేస్తే వైసీపీకి నష్టం జరుగుతుంది. అందుకే ఆయన బీజేపీ లేని తెలుగుదేశం-జనసేన పొత్తు కోసం ఎదురుచూస్తున్నారు.
Recommended Video


టీడీపీ-జనసేన మధ్య ఓట్ల బదిలీ జరుగుతుందా?
ప్రతిపక్షాల ఓట్లలో చీలిక తేవడంద్వారా అధికారం సులువవుతుంది. తెలుగుదేశం-జనసేన పొత్తులో రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలీ ఎంతమేరకు జరుగుతుందనే అనుమానం ఆ రెండు పార్టీల్లో కూడా ఉంది. వైసీపీకి కూడా ఇదే కావాలి. అందుకే జగన్ పవన్‌కల్యాణ్‌పై మైండ్‌గేమ్ ఆడుతున్నారు. పదే పదే దత్తపుత్రుడంటూ వ్యాఖ్యానించడంద్వారా జనసేనాని రెచ్చగొట్టి బీజేపీ లేకుండానే టీడీపీవైపు బలంగా
మళ్లేలా ప్రయత్నిస్తున్నారంటూ సీనియర్ రాజకీయవేత్తలు భావిస్తున్నారు. ఎవరి వ్యూహాలు ఫలిస్తాయో తెలియాలంటే కొద్దిరోజులు వేచిచూడక తప్పదు మరి.!!












Click it and Unblock the Notifications