కాబోయే మంత్రులను ఖరారు చేస్తున్న సీఎం జగన్..! సమస్యలపై కార్యకర్తల ఏకరువు..!!
ముఖ్యమంత్రి జగన్ నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమీక్షలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో లక్ష్యంగా 175 సీట్లని స్పస్టం చేస్తున్నారు. అదే సమయంలో నియోజకవర్గంలోని సమస్యలను కార్యకర్తలు సీఎం ముందు ఏకరువు పెడుతున్నారు. నిధుల విడుదల పైన అభ్యర్ధిస్తున్నారు. కొందరికి సంక్షేమ పథకాలు నిలిపివేయటం పైన ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని వివరిస్తున్నారు. ప్రధానంగా రోడ్ల సమస్య పరిష్కరించా లని కార్యకర్తలను ముఖ్యమంత్రిని అభ్యర్ధిస్తున్నారు.
సమీక్ష సమావేశాల్లో ప్రారంభంలో భాగంగా తొలి రోజున కుప్పం కార్యకర్తలతో సమావేశమైన సీఎం జగన్.. రెండో రోజు శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకర్గానికి చెందిన కార్యకర్తలతో చర్చించారు. ఇక, ముఖ్యమంత్రి ఈ సమావేశాల్లో కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.

టార్గెట్ 175 సీట్లు..
151 సీట్లు కాదు ఖచ్చితంగా 175 సీట్లు సాధించాలని చెబుతూ..అందుకు ఏం చేయాలో దిశా నిర్దేశం చేస్తున్నారు. ప్రతీ నియోజకవర్గంలో ప్రతీ ఇంటికీ మేలు జరుగుతోందంటూ నియోజకవర్గంలో అందిస్తున్న పథకాల గురించి చెప్పుకొచ్చారు. ఈ మూడేళ్ల కాలంలో నియోజకవర్గాల వారీగా డీబీటీ కింద ఎంత జమ చేసిందీ వివరిస్తున్నారు.
నియోజకవర్గంలో చేయాల్సిన పనుల పైన ఆరా తీస్తున్నారు. అందుకు అవసరమయ్యే నిధుల అంచనాల గురించి తెలుసుకుంటున్నారు. 87 శాతం ఇళ్లకు రాష్ట్రంలో ప్రయోజనాలు అందాయని.. ఏ ఒక్కరూ అందలేదని చెప్పటం లేదనే విషయాన్ని వివరించారు. 175 సీట్లు గెలుచుకోవాలంటే అది తన ఒక్కడి వల్ల కాదని..అందరూ కలిసి కట్టుగా పని చేయాల్సిందేనని సూచించారు. రాజాం నియోజకవర్గంలో పథకాల కింద రూ 775 కోట్లు ఇచ్చామని సీఎం వివరించారు.

స్థానిక సమస్యలపై కార్యకర్తల ఏకరువు
9,599 ఇళ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. అయితే, ఈ సమయంలో సీఎం జగన్ తిరిగి అధికారంలోకి రావటం పైన ధీమా వ్యక్తం చేస్తూనే..అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు సూచిస్తున్నారు. అందులో భాగంగా..తిరిగి అధికారంలోకి వస్తే మంత్రులు ఎవరు ఉండేది ఖరారు చేస్తున్నారు. కుప్పం నుంచి వైసీపీ గెలిస్తే.. ఎమ్మెల్సీగా ఉన్న నియోజకవర్గ ఇంఛార్జ్ భరత్ ను మంత్రిని చేస్తానని ముఖ్యమంత్రి వెల్లడించారు.
గత ఎన్నికల్లోనూ భరత్ తండ్రి చంద్రమౌళిని గెలిపిస్తే మంత్రి అవుతారని ఎన్నికల ప్రచార సమయంలో జగన్ హామీ ఇచ్చారు. అయితే, కుప్పం నుంచి పోటీ చేసే చంద్రబాబు గెలిస్తే సీఎం అవుతారనే వాదనకు జగన్ సమాధానం ఇచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రిని అవుతానని చెప్పటం మినహా.. నియోజకవర్గానికి ప్రయోజనం లేదనే విషయం స్పష్టం అవుతుందని చెప్పుకొచ్చారు.

మంత్రి పదవులపై సీఎం హామీ..!?
ఇక, ఇప్పుడు రాజాం నియోజకవర్గం సమీక్ష సమయంలో వచ్చే ఎన్నికల్లో రాజాంలో గెలిస్తే కంబాల జోగులును మంత్రిని చేస్తానంటూ సీఎం హామీ ఇచ్చారని సమావేశంలో పాల్గొన్న కార్యకర్తలు సమీక్ష తరువాత చర్చించుకోవటం ఆసక్తి కరంగా మారింది. అయితే, ఇంకా ఎన్నికలకు సమయం ఉండటం... ఇప్పుడే మంత్రులు ఎవరనే విషయం చెప్పటం పార్టీకి ఈ పరిస్థితుల్లో లాభమా - నష్టమా అనే చర్చ మొదలైంది.
అయితే, ప్రతీ సీటు వచ్చే ఎన్నికల్లో కీలకం కావటంతో.. సర్వే నివేదికల ఆధారంగా కష్టపడి గెలవాల్సిన సీట్ల విషయంలోనే ముఖ్యమంత్రి ఈ హామీలు ఇస్తున్నారనే అభిప్రాయం పార్టీ ముఖ్య నేతల్లో వ్యక్తం అవుతోంది. సీఎం రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. తిరిగి సోమవారం నుంచి నియోజకవర్గాల సమీక్షలు కొనసాగనున్నాయి.












Click it and Unblock the Notifications