ఏపీ లో ఎన్నికలకు ముఖ్యమంత్రి ముహూర్తం - ప్రతిపక్షాలకు ఛాన్స్ లేకుండా..!!
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు. షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయా. ముఖ్యమంత్రి జగన్ ముందస్తుగానే ఎన్నికలకు వెళ్తారా. దీని పైన ప్రతిపక్ష టీడీపీ మొదలు రాజకీయ వర్గాల్లో అనేక అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం 2024 తొలి త్రైమాసికంలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆరు నెలల సమయం ముగియగానే దాదాపు రెండేళ్లకు పైగా కరోనా ఇబ్బందులు పెట్టింది.
పాలన పూర్తిగా కరోనా పైనే ఫోకస్ చేయాల్సి వచ్చింది. ఇక, ఇప్పుడు మూడున్నారేళ్ల పాలన దాదాపుగా ముగిసింది. కానీ, ఇప్పటికే రానున్న ఎన్నికల పైన సీఎం జగన్ కసరత్తు ప్రారంభించారు. ఎన్నికల పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

వైసీపీకి అనుకూలంగా సర్వే రిపోర్టులు
ముందుగానే పార్టీ నేతలను - ఎమ్మెల్యేలను ప్రజలకు దగ్గర చేసే కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఎమ్మెల్యేల పని తీరును నిశితంగా పరిశీలిస్తున్నారు. తరచూ జిల్లా పర్యటనలు చేస్తున్నారు. పార్టీ ప్లీనరీ వేదికగా తన ఎన్నికల నినాదం ఏంటో స్పష్టం చేసారు. సంక్షేమం - సామాజిక న్యాయం- విశ్వసనీయ నినాదాల ఆధారంగా జగన్ మరోసారి ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు.
ఇందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. దీంతో పాటుగా పరిశ్రమలు - ఉపాధి కల్పన వంటి వాటి పైన మిగిలిన సమయంలో చేయగలిగినంత చేయాలని నిర్ణయించారు. ఇదే సమయంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ ప్రజల్లో సానుకూలత ఉందంటూ తాజాగా జాతీయ మీడియా సంస్థల సర్వేల్లో స్పష్టమైంది. ముఖ్యమంత్రి కూడా క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు.

ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా
ఈ సర్వేల్లో ప్రతిపక్షాలు బలం పుంజుకోలోదనే అంశం స్పష్టం అయింది. టీడీపీ -జనసేన పొత్తు ఖాయమని వైసీపీ భావిస్తోంది. వీరితో బీజేపీ కలవదని వైసీపీ అభిప్రాయం. కానీ, ఈ రెండు పార్టీలు బీజేపీతో పొత్తు కోసం చేస్తున్న ప్రయత్నాలను వైసీపీ గమనిస్తోంది. దీంతో.. తాజాగా వైసీపీ ఒక కీలక ప్రతిపాదన పైన చర్చ జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
షెడ్యూల్ సమయం కంటే ఆరు నెలలు ముందుగానే ..అంటే సరిగ్గా ఏడాది సమయంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే తమకు అనుకూలంగా ఉంటుందని వైసీపీ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో..వచ్చే ఏడాది ఆగస్టు - నవంబర్ మధ్య కాలంలోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. ఆ దిశగానే వైసీపీ ఎన్నికల సమరానికి సిద్దమయ్యేలా ప్రణాళికలు సిద్దం చేస్తోందని చెబుతున్నారు.

పార్లమెంట్ ఎన్నికల కంటే ముందుగానే
ప్రతిపక్షాలు పొత్తుల పైన ఇంకా స్పష్టత రాకపోవటం.. ఇప్పటి వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి టీడీపీతో జత కట్టేందుకు ఇప్పటికిప్పుడు సిద్దంగా లేకపోవటంతో...వైసీపీ అధినాయకత్వం వేగంగా అడుగులు వేస్తోంది. తన బలంతో పాటుగా ప్రత్యర్ధి పార్టీల బలహీనతల ఆధారంగా ఈ ఆలోచన పైన వర్కవుట్ చేస్తున్నారు.
దీనికే సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకుంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగానే ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పార్లమెంట్ సీట్ల అభ్యర్ధులు.. ఎంపీల గెలుపు బాధ్యతల భారం తగ్గుతుంది. ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న వారు కూడా తమ పరిధిలోని ఎమ్మెల్యేల గెలుపు కోసం పని చేయాల్సి ఉంటుంది.
తెలంగాణ లో బీజేపీ ఫోకస్..అక్కడ వారికి సాయం చేసి..ఏపీలో సాయం తీసుకోవాలని భావిస్తున్న పార్టీలకు ఈ నిర్ణయం ద్వారా చెక్ పెట్టాలనేది వైసీపీ వ్యూహంగా తెలుస్తోంది. దీంతో..సరిగ్గా ఏడాది కాలంలోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications