సీఎం జగన్ ఆపరేషన్ ప్రకాశం - బాలినేని ఎఫెక్ట్..!!
మాజీ మంత్రి బాలినేని ఎపిసోడ్ ప్రకాశం వైసీపీలో కలకలంగా మారింది. బాలినేని సొంత పార్టీ ముఖ్య నేతలనే తన పైన కుట్ర చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. పరోక్షంగా పార్టీలో కీలక స్థానంలో ఉన్న నేతను టార్గెట్ చేసినట్లు స్పష్టం గా కనిపిస్తోంది. ప్రకాశం జిల్లాలో ఇద్దరు ముఖ్య నేతల మధ్య మొదలై ఈ రాజకీయ యుద్దం పార్టీ పైన ప్రభావం పడే అవకాశం ఉంది. ఎన్నికలకు సిద్దం అయ్యే వేళ ఈ పరిణామాలతో పార్టీకి నష్టం జరగకుండా సీఎం జగన్ అలర్ట్ అయ్యారు. ఆపరేషన్ ప్రకాశం జిల్లా ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం.
ప్రకాశం జిల్లాపై ఫోకస్ : వైసీపీలో నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలు షాకింగ్ గా మారాయి. ఏకంగా ముగ్గురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ధిక్కార ధోరణి ప్రదర్శించారు. వారి స్థానంలో పార్టీ కొత్త వారిని ఇంఛార్జ్ లు గా బాధ్యతలు అప్పగించింది. పార్టీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో పరిస్థితులను ఇప్పడిప్పుడే తిరిగి వైసీపీ తన కంట్రోల్ లోకి తెచ్చుకుంటోంది.

నెల్లూరు జిల్లాలో పార్టీలో పరిస్థితులను చక్కబెట్టే బాధ్యతల ను సీఎం జగన్ బాలినేనికి అప్పగించారు. ప్రాంతీయ సమన్వయకర్తగా బాలినేని నెల్లూరులో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు బాలినేని ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. తన సొంత నియోజకవర్గం ఒంగోలుకే పరిమితం అవుతానని స్పష్టం చేసారు.
స్వయంగా పర్యవేక్షణ : ఇదే సమయంలో ప్రకాశం జిల్లా వైసీపీలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. బాలినేని వర్సస్ మాజీ ఎంపీ అన్నట్లుగా పరిస్థితి మారుతోంది. ఎమ్మెల్యేలు సైతం చోటు చేసుకుంటున్న పరిణామాలతో డైలమాలో పడ్డారు. దీనిని టీడీపీ తమకు అవకాశంగా మలచుకొనే ప్రయత్నాలు చేస్తోంది. వెంటనే పరిస్థితులను చక్కదిద్దేందుకు స్వయంగా సీఎం జగన్ రంగంలోకి దిగారు.
ప్రకాశం జిల్లాలోని రాజకీయ పరిస్థితుల పైన పూర్తి స్థాయిలో ఐప్యాక్ (I-PAC) ద్వారా నివేదిక తెప్పించుకున్నారు. అక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాల పైన ఆరా తీసినట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీకి నష్టం చేసే విధంగా ఎవరూ వ్యవహరించినా సహించేది లేదని సీఎం జగన్ తేల్చి చెబుతున్నారు. సమస్యలు ఉంటే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పార్టీ ముఖ్య నేతలను ఆదేశించారు. ప్రకాశం జిల్లాలోని ప్రతీ నియోజకవర్గంలో ప్రతీ మండలంలో పార్టీ లో చోటు చేసుకుంటున్న పరిణామాల పైన నిరంతరం పొలిటికల్ యాక్షన్ కమిటీ ఐప్యాక్ ద్వారా సమాచారం సేకరిస్తున్నారు.

కీలక నిర్ణయాల దిశగా : ప్రకాశం లో ఇద్దరు నేతలు కావాల్సిన వారే అయినా.. పార్టీకి నష్టం జరిగేలా వ్యవహరిస్తే మాత్రం సహించే ధోరణిలో సీఎం లేరని సీనియర్లు చెబుతున్నారు. ఐప్యాక్ నుంచి ప్రత్యేక టీంలను జిల్లాకు పంపి క్షేత్ర స్థాయిలో పరిస్థితుల పైన పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. ఇప్పటికే బాలిలేని..ఆయన పరోక్షంగా ఆరోపిస్తున్న మరో ముఖ్య నేతకు ఒకరి విషయంలో మరొకరు జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
ఎన్నిక లకు సిద్దం అవుతున్న వేళ బలంగా ఉన్న జిల్లాల్లో సొంత పార్టీ నేతలే సమస్యలను తీసుకొస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెబుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో బాలినేని కూడా ముఖ్యమంత్రి జగన్ తో సమావేశం అవుతారని తెలుస్తోంది. తాను పార్టీలోనే ఉంటానని..జగన్ సీఎం అయ్యేలా పని చేస్తానని ఇప్పటికే బాలినేని స్పష్టం చేసారు. రానున్న రెండు రోజుల్లో ప్రకాశం జిల్లాలో పార్టీ పరిస్థితి పైన ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications