సీఎం జగన్ సీరియస్: అనిల్ -మంత్రి కాకానికి పిలుపు : వరుస పరిణామాలతో...!!
నెల్లూరు జిల్లా పార్టీ నేతల పైన సీఎం జగన్ సీరియస్ గా ఉన్నారు. కొద్ది రోజులుగా నెల్లూరులో జరుగుతున్న పరిణామాలతో సీఎం నేరుగా రంగంలోకి దిగారు. నెల్లూరు మాజీ మంత్రి అనిల్.. తాజా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి రావాలని ఆదేశించారు. కేబినెట్ విస్తరణ సమయంలో కొందరు అలకబూనిన..నిరసనలు వ్యక్తం చేసిన సీనియర్లకు క్లాస్ తీసుకున్న సీఎం..వారికి వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు అవసరాన్ని వివరించారు. 2024లో తిరిగి అధికారంలోకి వస్తే..మరోసారి మంత్రులుగా అవకాశం వస్తుందని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో కొన్ని చోట్ల నిరసనలు పరిధి దాటటంతో వారి పైన సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

జిల్లాల్లో పరిస్థితులపై నేరుగా జగన్..
ఇక..తాజాగా, జిల్లాలకు ఇన్ ఛార్జ్ మంత్రులతో పాటుగా.. పార్టీ నుంచి జిల్లా అధ్యక్షులు - రీజనల్ కన్వీనర్లను నియమించారు. ఇందులో మంత్రి పదవి దక్కని వారితో పాటుగా ప్రస్తుతం మంత్రులుగా సీనియర్లు ఉన్నారు. అయితే, నెల్లూరు జిల్లాలో కొద్ది రోజులుగా వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం సాగుతోంది. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలి సారి కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లాకు వస్తున్న సమయంలోనే మాజీ మంత్రి అనిల్ నెల్లూరు నగరంలో బహిరంగ సభ ఏర్పాటు చేసారు. ఇది ఎవరికీ వ్యతిరేకంగా ఏర్పాటు చేసిందని కాదని ఆయన చెప్పుకొచ్చారు. అయితే, నగరంలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఫ్లెక్సీలు తొలిగించటం..తాజాగా ఎంపీ వేమిరెడ్డి ఫ్లెక్సీలు సైతం తప్పించటం పైన రాజకీయంగా వివాదం చోటు చేసుకుంది.

నేతల మధ్య విభేదాల పై ఆరా..ఆగ్రహం
ఇదే సమయంలో సీనియర్ మంత్రి ఆనం చేసిన వ్యాఖ్యల పైన రాజకీయంగా విమర్శలకు కారణమైంది. ఇక, తాజాగా జిల్లా రీజనల్ అధ్యక్షుల బాధ్యత కేటాయింపులో భాగంగా మాజీ మంత్రి అనిల్ కు కడప - తిరుపతి జిల్లాలను కేటాయించారు. అయితే, పార్టీలో సీనియర్లు ఒక వైపు జగన్ విధేయులమని చెబుతూనే...జిల్లాలో చేస్తున్న రాజకీయ రచ్చ పైన సీఎం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రకాశం- నెల్లూరు జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్ గా ఉన్న సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డితో మంగళవారం సీఎం జగన్ సుదీర్ఘంగా సమావేశం నిర్వహించారు. ప్రకాశంతో పాటుగా నెల్లూరు రాజకీయాల పైన వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ రోజు నెల్లూరు నేతలతో సీఎం సమావేశం
ఇక, ఈ రోజున మాజీ మంత్రి అనిల్ సీఎం జగన్ ను కలవనున్నారు. మంత్రి కాకాని సైతం కలిసే ఛాన్స్ ఉంది. దీంతో...ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని చెబుతున్న..ఈ ఇద్దరికీ కోల్డ్ వార్ ముగింపు పైన స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో ఇదే విధంగా కొనసాగితే తీసుకొనే చర్యల పైన తేల్చి చెప్పే ఛాన్స్ ఉందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. దీంతో..ఇప్పుడు సీఎం జగన్ పార్టీలో అంతర్గత సమస్యల పరిష్కారం పైన కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించటంతో.. ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనే ఉత్కంఠ పార్టీలో కనిపిస్తోంది.