బాలయ్య- పవన్ పేరుతో మద్యం : ఒక్క బ్రాండ్ కూడా మేము తేలేదు - సభలో సీఎం జగన్..!!
ఏపీలో మద్యం అమ్మకాలు..బ్రాండ్లు..వివాదాల పైన సీఎం జగన్ స్పష్టత ఇచ్చారు. తన ప్రభుత్వం మీద జరుగుతున్న ప్రచారాన్ని తిప్పి కొట్టారు. 2019 కి ముందు ఉన్న డిస్టలరీలు.. బ్రాండ్లు మినహా.. తమ ప్రభుత్వం లో ఒక్క డిస్టలరీ - కొత్త బ్రాండ్ ను తీసుకురాలేదని సీఎం జగన్ ప్రకటించారు. చంద్రబాబు హయాంలో 254 బ్రాండ్లు వచ్చాయని లిస్టుతో సహా వివరించారు. పలు మందు బ్రాండ్ల పేర్లు తమ హయాంలో తెచ్చినట్లుగా ప్రచారం చేస్తున్నారని..ఒక్క బ్రాండ్ కూడా తాము తేలేదంటూ సభలో ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏపీలో చీప్ లిక్కరు లేదని తేల్చి చెప్పారు. తాము 14 జిల్లాలు.. 16 మెడికల్ కాలేజీలను తీసుకొస్తే.. నాడు చంద్రబాబు హయాంలో 16 డిస్టలరీలు తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు.

బావమర్ది - దత్తపుత్రుడు పేర్లతోనూ
అందరూ ప్రస్తావిస్తున్న ప్రెసిడెంట్ మెడల్ పేరుతో బ్రాండ్ తీసుకొచ్చింది చంద్రబాబు హయాంలోనే వచ్చిందని స్పష్టం చేసారు. మద్యం అమ్మకాలు తగ్గి..ఆదాయం తగ్గాలని..దీని ద్వారా మహిళలకు అమలు చేస్తున్న పథకాలకు డబ్బుల కొరత తీసుకురావటమే వారి లక్ష్యమని స్పష్టం చేసారు. ఏపీని కుదేలు చేస్తూ..అధికారంలో రాలేమనే కడుపు మంటతో ఉన్నారని చెప్పారు. వారి కడుపు మరింత మండాలని కోరుకుంటున్నట్లు వివరించారు. చంద్రబాబు హయాంలో తన దత్త పుత్రుడు ..బామ్మర్ది పేరుతోనూ బ్రాండ్లు తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు. వారి పేర్లతో మద్యం బ్రాండ్లు తీసుకొచ్చి రుణం తీర్చుకొనే ప్రయత్నం చేసారని ఎద్దేవా చేసారు. పవర్ స్టార్ 999, లెజెండ్ వంటి బ్రాండ్లను ప్రవేశ పెట్టింది చంద్రబాబు ప్రభుత్వంలోనే అంటూ పేర్కొన్నారు.

చంద్రబాబు హాయంలో వచ్చిన డిస్టలరీలే
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న డిస్టలరీల్లో ఎస్పీవై రెడ్డి.. ఆది కేశవులు నాయుడు కుటుంబాలు నిర్వహిస్తున్నవేనని వివరించారు. అదే విధంగా యనమల వియ్యంకుడు ఒక డిస్టలరీ నిర్వహిస్తున్నారని చెప్పారు. అయ్యన్న పాత్రుడు విశాఖ డిస్టలరీ పేరుతో 2019 ఫిబ్రవరిలో లైసెన్స్ తీసుకున్నారని.. ఆ తరువాత దానిని అమ్మేసారని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో 254 బ్రాండ్లు తీసుకొచ్చారని లిస్టును ప్రదర్వించారు. అందులో భూం భూం బీర్.. గవర్నర్ ఛాయిస్.. ప్రెసిడెంట్ మెడల్ వంటివి ఉన్నాయన్నారు. సోషల్ మీడియా ద్వారా త్రీ క్యాపిటల్స్.. స్కపెషల్ స్టేటస్ పేరుతోనూ మద్యం అమ్మకాలు చేస్తున్నట్లు ప్రచారం చేసారని..అసలు ఆ బ్రాండ్లు లేవని స్పష్టం చేసారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత 43 వేల బెల్టు షాపులను రద్దు చేసామని ముఖ్యమంత్రి గుర్తు చేసారు.

ప్రభుత్వాన్ని - రాష్ట్రాన్ని దెబ్బ తీయటమే లక్ష్యం
ధరలు పెంచటం ద్వారా మద్యం అమ్మకాలు నియంత్రించాలని భావించామని..అయితే, ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులు అధికారులు వివరించటంతో తిరిగి ధరలు తగ్గించామని సీఎం జగన్ సభలో చెప్పుకొచ్చారు. అదే విధంగా జంగారెడ్డి గూడెంలో చోటు చేసుకున్న మరణాలు ఎక్కడా చీప్ లిక్కర్.. కల్తీ మద్యం కారణం గా చోటు చేసుకోలేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో కల్తీ మధ్యం లేదని సీఎం స్పష్టం చేసారు. కేవలం టీడీపీ..మద్దతు మీడియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయటం కోసమే ఇటువంటి రాద్దాంతం చేస్తున్నారంటూ జంగారెడ్డి గూడెం బాధితుల కుటుంబ సభ్యులు ఏం చెప్పారనేది సభలో ప్రదర్శించారు. చంద్రబాబు ఇంటి పేరు నారా కాదని..సారా చంద్రబాబుగా పిలవాల్సిన అవసరం ఉందని సీఎం వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications