విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు - పరిశ్రమలకు సింగిల్ విండో అనుమతులు : సీఎం జగన్..!!
ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ పాలసీ 2022-2027లో భాగంగా మరిన్ని ప్రోత్సాహకాలకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. సీఎం జగన్ స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు(ఎస్‌ఐపీబీ)తో సమీక్ష నిర్వహించారు. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ఎగుమతులను ప్రోత్సహించే దిశగా ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ పాలసీ 2022-27లో మరిన్ని చర్యల దిశగా నిర్ణయించారు. ఇప్పుడున్న ఎగుమతులను 5 ఏళ్లలో రెట్టింపు చేసే దిశగా అడుగులు వేయాలని డిసైడ్ అయ్యారు. ఐదేళ్ల కాలంలో రూ.3.5 లక్షల కోట్లు ఎగుమతులు సాధించాలని లక్ష్యంగా నిర్ణయించారు.
దీంట్లో భాగంగా పలు నిర్ణయాలకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో కృషక్ భారతి కో-ఆపరేటివ్ లిమిటెడ్ (క్రిబ్కో) ఆధ్వర్యంలో రెండు విడతల్లో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు పైన చర్చించారు. రూ.560 కోట్లతో 250 కె.ఎల్.డి. సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటు కానుంది. 100 ఎకరాల్లో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్న క్రిబ్‌కో.. దీని ద్వారా 400 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఇదికాకుండా మరిన్ని విత్తన శుద్ధి సహా వివిధ ప్రాససింగ్ యూనిట్లు ఏర్పాటు చేసే దిశగా అడుగులేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వానికి కంపెనీ వివరించింది.

ఈ సమావేశంలో.. సీఎం జగన్ రాష్ట్రం నుంచి అధికంగా ఆక్వా రంగం నుంచి ఎగుమతులు ఉన్నాయని..ఆక్వా ఉత్పత్తుల క్వాలిటీ పెంచడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. సచివాలయాల్లోని ఆర్బీకేల ద్వారా ఆక్వా ఉత్పత్తుల నాణ్యత పెంచడానికి చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. దేశంలో మెరైన్ ఎగుమతుల్లో 46శాతం రాష్ట్రం నుంచే ఉన్నాయని వివరించారు. దీంతో ఈ రంగాన్ని తగిన విధంగా ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు.
ఏపీలో పరిశ్రమలకు అనుమతుల విధానం పైన నిరంతర పర్యవేక్షణ ఉండాలని.. సింగిల్ విండో విధానంలో అనుమతులు కొనసాగాలని సీఎం స్పష్టం చేసారు.అత్యంత పారదర్శక విధానాల్లో భాగంగా ఈ మార్పులను తీసుకు వచ్చామని చెప్పుకొచ్చారు. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.












Click it and Unblock the Notifications