జగన్ - పార్టీ లీడర్స్‌ను కలవాలా-ఇక అక్కడే : చంద్రబాబు - పవన్ ఫాలో కావాల్సిందేనా..!!
ఏపీలో మూడు రాజధానుల ఎఫెక్ట్ ముందుగా అధికార పార్టీ పైనే పడనుంది. అమరావతి కేంద్రగా పాలన సాగుతున్న సమయంలో సీఎం జగన్ మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. చట్ట సభల్లో బిల్లుల రూపంలో ఆమోదం లభించింది. అయితే, కోర్టులో మాత్రం పెండింగ్ లో ఉంది. న్యాయ పరమైన అనుమతులు రావటం మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటి వరకు కరోనా కారణంగా.. తరలింపు కార్యక్రమాలు ఏవీ మొదలు పెట్టలేదు.

ఇక..మొదలు పెట్టేద్దాం..
అదే విధంగా న్యాయస్థానం ఆంక్షలు ఉండటంతో...తరలింపు ప్రక్రియ నిలిచిపోయింది. ఇదే సమయంలో హైదరాబాద్ లో ఉన్న లోకాయుక్త-మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను మాత్రం కర్నూలు కు తరలించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అవి అమరావతి నుంచి తరలించే కార్యాలయాలు కాకపోవటం..హైదరాబాద్ నుంచి న్యాయ రాజధానికి తరలిస్తున్నామని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. అయితే, సచివాలయం-ప్రభుత్వ కార్యలయాలు విశాఖకు తరలించటం సమయం తీసుకున్నా..ముఖ్యమంత్రి జగన్ ముందుగా విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభిస్తారని చెప్పుకొచ్చారు.

దసరా నుంచి విశాఖలోనే సీఎం జగన్..
ఇందు కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం సైతం ఎంపిక పూర్తయింది. అయితే, కరోనా ఎఫెక్ట్ తో నిర్ణయం అమలు కాలేదని వైసీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో రానున్న దసరా నుంచి ముఖ్యమంత్రి ఇక విశాఖ క్యాంపు కార్యాలయం నుంచే పాలన చేస్తారని వైసీపీ ముఖ్యులు చెబుతున్నారు. గత నెలలో ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన సమయంలో ఇదే విషయం పైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తోనూ చర్చించినట్లుగా సమాచారం.

వైసీపీ ప్రధాన కార్యాలయం తరలింపు..
కార్యాలయాల తరలింపు పైన న్యాయపరమైన వివాదం నడుస్తున్నా.. సీఎంగా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పాలన సాగించే అవకాశం సీఎంకు ఉంటుందని నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ప్రధాన కార్యాలయం సైతం విశాఖ లోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం తాడేపల్లి కేంద్రంగా వైసీపీ ప్రధాన కార్యాలయం పని చేస్తోంది. పార్టీ ఆఫీసు కోసం ఉడా పార్కు సమీపంలో నిర్మాణం పూర్తికావస్తున్న ఒక భవనాన్ని పార్టీ కార్యాలయానికి అనువైనదిగా గుర్తించారు.

పార్టీ ముఖ్య నేతలూ విశాఖలోనే..
భవన యజమానితోనూ చర్చలు పూర్తయ్యాయి. కావాల్సిన విధంగా మార్పులు - చేర్పులు పూర్తి చేసుకొని దసరా నుంచి విశాఖ కేంద్రంగా వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభించాలని నిర్ణయించారు. దీంతో..ఇక నుంచి వైసీపీ ముఖ్య నేతలు సైతం విశాఖ లోనే ఉండనున్నారు. కేబినెట్ సమావేశాలతో పాటుగా... పార్టీ కీలక సమావేశాలు సైతం విశాఖలోనే జరుగుతాయని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. టీడీపీ ఏపీ ప్రధాన కార్యాలయం మంగళగిరి సమీపంలోని ఆత్మకూరు వద్ద ఉంది.

టీడీపీ - జనసేన-బీజేపీ ఏం చేస్తాయి..
అదే విధంగా జనసేన ప్రధాన కార్యాలయం సైతం విజయవాడ- మంగళగిరి మధ్య ఉంది. ఇక, ఇప్పుడు వైసీపీ పార్టీ ప్రధాన కార్యాలయం విశాఖకు తరలించాలని నిర్ణయించటంతో..టీడీపీ- జనసేన ఏం చేస్తాయనేది ఆసక్తి కరంగా మారుతోంది. అదే సమయంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం సైతం విజయవాడ కేంద్రంగా పని చేస్తోంది. ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా వివాదంగా మారిన మూడు రాజధానుల వ్యవహారం...ఇక, ఇప్పుడు పార్టీల పరంగా చర్చకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా దసరా నుంచి సీఎం జగన్ ..పార్టీ ముఖ్య నేతలను కలవాలంటే వైసీపీ నేతలు ఛలో వైజాగ్ అనాల్సిందే.












Click it and Unblock the Notifications