చంద్రబాబు చేసేది ఇదే - ప్రజలకు సీఎం జగన్ కీలక పిలుపు..!!
తెలుగుదేశం అధినేత చంద్రబాబు పై ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. చంద్రబాబు విధానం దోచుకో..పంచుకో అని ఫైర్ అయ్యారు. ఎన్నికల వేళ ఇంకా ఎన్నో అబద్దాలతో నమ్మించే ప్రయత్నం చేస్తారని.. వారిని నమ్మవద్దని సీఎం జగన్ పేర్కొన్నారు. తన హయాంలో ప్రతీ ఇంటికి మంచి జరిగిందా లేదా అనేదే పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ కీలక పిలుపునిచ్చారు.
చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు : ముఖ్యమంత్రి జగన్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించారు. రూ 224 కోట్లతో నిర్మించిన లక్కసాగరం పంప్ హౌస్‌ను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. కర్నూలు జిల్లాలోని కృష్ణగిరి మండలం ఆలంకొండ వద్ద నిర్మించిన లక్కసాగరం పంప్‌హౌస్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. దీని ద్వారా కర్నూలు, నంద్యాల జిల్లాలకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి జగన్ చెప్పుకొచ్చారు.

ఈ పంప్‌హౌస్ ద్వారా హంద్రీనీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి సాగు, తాగునీరు సరఫరా కానున్నాయి. దీని ద్వారా డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాల్లో 77 చెరువులు జలకళను సంతరించుకోనున్నాయి. 10,394 ఎకరాలకు సాగునీరు అందనుంది. సీమ బిడ్డగా.. నీటి విలువ తెలిసిన వ్యక్తిగా ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పుకొచ్చారు.
మంచి జరిగితే అండగా నిలవండి : చంద్రబాబు పాలనలో సీమ ప్రాజెక్టులను చిన్న చూపు చూసారని ముఖ్యమంత్రి ఆరోపించారు. కరువు జిల్లాలను పట్టించుకోలేదన్నారు. గత ప్రభుత్వం , ఇప్పటి ప్రభుత్వం మధ్య తేడాను గుర్తించాలని జగన్ సూచించారు. ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందా లేదా అనేది ఆలోచన చేయాలన్నారు.
గతంలో ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్, గతం కంటే అప్పులు ఇప్పుడే తక్కువ ఉన్నా ఎలా చేయగలిగాం..నాడు చంద్రబాబు ఎందుకు చేయలేదో గుర్తించాలన్నారు. ఇప్పటి వరకు రూ 2.35 లక్షల కోట్లు నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసామన్నారు. చంద్రబాబు నమ్మకం ప్రజలు కాదని, దుష్ట చతుష్ఠయం పైనే అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని దోచుకోవటం..వారితో పంచుకోవటం లక్ష్యంగా చంద్రబాబు వ్యవహరించారని ఆరోపించారు.

ఎవరూ సాటిలేరు : దోచుకుంటే ప్రశ్నిస్తానని చెప్పిన ప్రశ్నించడని పరోక్షంగా పవన్ పైన సీఎం జగన్ వ్యాఖ్యలు చేసారు. ఈ ప్రభుత్వంలో ప్రతీ గ్రామంలోనూ పాలన మారిందన్నారు. సచివాలయం, వాలంటీర్ వ్యవస్థ అందుబాటు లోకి వచ్చిందని చెప్పారు. ఎక్కడా రాజకీయాలు, పార్టీలు లేవు, వివక్ష లేదు, లంచాలు లేవు..అర్హత ఉంటే చాలు పూర్తిగా మంచి చేసే ప్రయత్నం చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు.
గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలను చూడాలని... ఇంగ్లీషు మీడియంతో పాటుగా భవిష్యత్ కు అవసరమైన బోధన విధానం అమల్లోకి వచ్చిందని చెప్పారు. ఏ రంగం చూసుకున్నా..సామాజిక న్యాయంలోనూ మనకు ఎవ్వరు సాటి లేరనే విధంగా ముందుకు వెళ్తున్నామని వివరించారు. ప్రతీ ఇంట మంచి జరిగి ఉంటే అండగా నిలవాలని ముఖ్యమంత్రి జగన్ పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications