పార్టీ సీనియర్లకు సీఎం జగన్ కీలక బాధ్యతలు..!?
ఎన్నికలకు సీఎం జగన్ పార్టీని సిద్దం చేస్తున్నారు. పక్కా లెక్కతో మందుకు వెళ్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి తన లక్ష్యం స్పష్టం చేసారు. ప్రతి ఇంటికీ మన ప్రభుత్వం చేస్తున్నమంచిని ప్రతికుటుంబానికీ తీసుకెళ్లాలని నిర్దేశించారు.
ఎన్నికల సంవత్సరంలో ఉన్నామని గుర్తించాలని చెప్పిన సీఎం..కేడర్ అత్యంత క్రియాశీలకంగా ఉండాలని నిర్దేశించారు. తాను ఎవరినీ వదులుకోవటానికి సిద్దంగా లేనని స్పష్టం చేసారు. ఇదే సమయంలో తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీ రీజనల్ ఇంఛార్జ్ లతో సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు.
ఏ ఒక్కిరనీ వదులుకోను: ఏ ఒక్క ఎమ్మెల్యేను పోగొట్టుకోవటానికి సిద్దంగా లేనని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేసారు. అందరితో పని చేయించి..మళ్లీ గెలిపించాలనేదే తన లక్ష్యమని స్పష్టం చేసారు. కోట్లాది మంది ప్రస్తుత ప్రభుత్వం పైన ఆధార పడి ఉన్నాయని సీఎం వివరించారు. ప్రజల్లో ఎమ్మెల్యే గ్రాఫ్ సరిగ్గా లేకపోతే పార్టీకి, కేడర్ కు నష్టం జరుగుతుందన్నారు.
తాను తన తండ్రి నుంచి నేర్చుకున్నది రాజకీయాలంటే మానవ సంబంధాలేనని చెప్పుకొచ్చారు. ఎన్నికల సంవత్సరంలో ఉన్నామని గుర్తుంచుకోవాలని సీఎం సూచించారు. పార్టీ ఎమ్మెల్యేలకు తన వైఖరి స్పష్టం చేసిన సీఎం జగన్ ఇప్పుడు పార్టీ ప్రాంతీయ సమన్వయ కర్తలతో కీలక సమావేశానికి నిర్ణయించారు. మంగళవారం ఈ సమావేశం జరగనుంది.

పార్టీ నేతలకు కీలక బాధ్యతలు: ప్రాంతీయ సమన్వయకర్తల సమావేశంలో సీఎం జగన్ వారికి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ ప్రధానంగా ఎమ్మెల్యేలు - పార్టీ కేడర్ తో సత్సంబంధాల పైన సీఎం వారికి దిశా నిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల గురించి ఎమ్మెల్యేలకు వివరించిన సీఎం జగన్..
ఇక ఎమ్మెల్యేలకు రీజనల్ కో ఆర్డినేటర్లు అన్ని సమయాల్లోనూ అందబాటులో ఉంటూ.. వారితో క్షేత్ర స్థాయిలో వాలంటీర్లు.. గృహసారథులను సమన్వయం చేసుకొనే బాధ్యతలను అప్పగించనున్నారు. అదే సమయంలో ప్రాంతీయ సమన్వయ కర్తలు తమ పరిధిలోని ప్రతీ ఎమ్మెల్యేతోనూ టచ్ లో ఉండి.. పార్టీ - ప్రభుత్వం పరంగా ఏం చేయాలనే దాని పైన కసరత్తు చేసి..నివేదికలు ఇవ్వాలని సూచించనట్లు తెలుస్తోంది.
ఎన్నికల ప్రచారంలోకి పార్టీ నేతలు: ప్రతిపక్షాల ప్రచారం పైనా సీఎం జగన్ కీలక సూచనలు చేసారు. ఈ నెలలో ఎమ్మెల్యేలు గడపకు గడపకు ప్రభుత్వం, జగనన్నే మా లక్ష్యం, జగనన్నకు చెబుదాం వంటి కార్యక్రమాల ద్వారా ఇక పూర్తిగా ప్రజల్లోనే ఉండేలా దిశా నిర్దేశం చేస్తున్నారు. ఎమ్మెల్యేలకు పార్టీ నాయకత్వానికి ఎక్కడా గ్యాప్ రాకుండా చూసే బాధ్యతను పార్టీ సమన్వయ కర్తలకు అప్పగించనున్నారు.
అదే విధంగా ఇప్పటి లాగానే ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ సమస్యలను నేరుగా సీఎంఓకు సందేశం ఇచ్చే విధానం మరింత పటిష్ఠం చేయాలని భావిస్తున్నారు. త్వరలో ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్లు గా ఉన్న ప్రాంతీయ సమన్వయకర్తలకు కీలక బాధ్యతలు అప్పగించటం ద్వారా రానున్న రోజుల్లో సీఎం జగన్ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications