ఎమ్మెల్యేలకు నో, నేరుగా పార్టీ శ్రేణులతో - సీఎం జగన్ కీలక భేటీ..!!
ఏపీలో ఎన్నికల యుద్దానికి సీఎం జగన్(YS Jagan) సిద్దమవుతున్నారు. అభ్యర్దుల ఎంపిక పైన తన అభిప్రాయాన్ని ఇప్పటికే స్పష్టం చేసారు. ఇదే సమయంలో అభ్యర్దుల ఎంపిక వేళ ముఖ్యమంత్రి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నేరుగా పార్టీ(YSRCP) మండల..ద్వితీయ శ్రేణి నాయకత్వంతో సమావేశం కానున్నారు. ఇందుకు ముహూర్తం ఖరారు చేసారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేల(MLAs)ను దూరంగా ఉంచుతున్నారు. ఈ సమావేశంలో సీఎం(CM Jagan) కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
కార్యకర్తలకు పిలుపు : కార్యకర్తలు ఎంతో కాలంగా సీఎం జగన్ తో కలిసే అవకాశం కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు వారు కోరుకున్న విధంగా సమయం కేటాయించేందుకు సీఎం నిర్ణయించారు. ఇందు కోసం రాష్ట్ర వ్యాప్తంగా మండల శ్రేణి నేతలతో సమావేశానికి ముహూర్తం ఖరారు చేసారు. అక్టోబర్ 9న విజయవాడ(Vijayawada)లో సీఎం జగన్ మండల స్థాయి నేతలతో సమావేశం కానున్నారు.

పార్టీలో సుదీర్ఘ కాలంగా పని చేస్తున్న నేతలతో పాటుగా అనుబంధ సంఘాల నేతలను ఆహ్వానిస్తున్నారు. తరచూ ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి ఇప్పుడు నేరుగా మండల స్థాయి నేతలతో సమావేశం కానుండడటంలో క్షేత్ర స్థాయి లో పార్టీ పరిస్థితులను తెలుసుకోవటంతో పాటుగా..ఎన్నికలకు దిశా నిర్దేశం చేయనున్నారు.
సీఎం ముఖ్య సమావేశం : విజయవాడలో జరిగే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలను పిలవటం లేదని సమాచారం. ఈ సమావేశంలో ప్రధానంగా వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమం పైన వారికి వివరించనున్నారు. పాదమాత్ర సమయంలో జగన్ నేరుగా పార్టీ శ్రేణులతో మమేకం అయ్యారు. సీఎం అయిన తరువాత వారితో కలిసేందుకు అవకాశం దక్కలేదు. ఎమ్మెల్యేల ద్వారానే క్షేత్ర స్థాయి కార్యక్రమాలపైన ఆరా తీస్తున్నారు.
ఇప్పుడు నేరుగా ద్వితీయ శ్రేణి నాయకత్వంతో సమావేశం కానుండటం ద్వారా పార్టీ నేతలు తమ నియోజకవర్గాల్లోని పరిస్థితులను నేరుగా సీఎం కు చెప్పుకొనే అవకాశం కల్పించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం.. ప్రతిపక్షాల పొత్తులు...కార్యకర్తలకు పార్టీలో భవిష్యత్ పైన హామీ వంటి అంశాలపైన సీఎం వారితో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికలపై దిశా నిర్దేశం : ముఖ్యమంత్రితో జరిగే సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలను ఎంపకి చేస్తున్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి నేతలు ఉండేలా ఎంపిక ప్రక్రియ ప్రారంభించారు. ఒక రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే చోటకు వచ్చే పార్టీ నేతలతో సీఎం సమావేశం కానున్నారు. గతంలో నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలతో సమీక్షలు ఏర్పాటు చేసినా..పూర్తి స్థాయిలో కొనసాగలేదు.
దీంతో, ఇప్పుడు వారితో సమావేశం అవ్వటం తో పాటుగా ఎమ్మెల్యే అభ్యర్దిని గెలుపే ప్రామాణికంగా ఎంపిక చేస్తామని..గెలుపు కోసం పని చేయాలని పార్టీ నేతలను సీఎం జగన్ కోరనున్నారు. ఇదే సమయంలో పార్టీ కోసం పని చేసిన వారిని ఏ విధంగా గుర్తింపు ఇచ్చే అంశం పైనా స్పష్టత ఇస్తారని తెలుస్తోంది. దీంతో, ఈ సమావేశం పైన పార్టీలో ఆసక్తి కనినిపిస్తోంది.












Click it and Unblock the Notifications