గవర్నర్ తో సీఎం జగన్ భేటీ - మంత్రివర్గ ప్రక్షాళన..!?
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మండలి ఎన్నికల ఫలితాల తరువాత సీఎం జగన్ కొత్త నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ఇదే సమయంలో ఈ సాయంత్రం గవర్నర్ తో సీఎం జగన్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల వేళ చోటు చేసుకున్న పరిణామాలు వివరించే అవకాశం ఉంది. మంత్రివర్గ ప్రక్షాళన పైనా ప్రచారం సాగుతోంది. దీంతో గవర్నర్ తో సీఎం జగన్ సమావేశం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.
ముఖ్యమంత్రి జగన్ ఈ సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీమ పరిణామాల్లో ఈ భేటీపై ఆసక్తి కనిపిస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలపై గవర్నర్ కు సీఎం జగన్ నివేదిక ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసారంటూ ఆ నలుగురిని పార్టీ నుంచి సస్పెండ్ చేసారు. నలుగురిని టీడీపీ డబ్బులిచ్చి ప్రలోభాలకు గురి చేసిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి గవర్నర్ కు సీఎం జగన్ నివేదించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎమ్మెల్యేలపై కఠిన చర్యలకు సిద్దం అవుతున్నారని భావిస్తున్న వేళ ఈ భేటీ కీలకంగా మారుతోంది.

ఇక..ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తరువాత ఏపీ కేబినెట్ ప్రక్షాళన ఉంటుందని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ సీఎం జగన్ కేబినెట్ లో మార్పుల పైన సంకేతాలు ఇచ్చారు. ఈ నెల 31న మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమచారం. అయితే, ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ మంత్రివర్గ ప్రక్షాళన చేస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో ముగ్గురు నుంచి అయిదుగురు వరకు మార్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కొత్తగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా గవర్నర్ తో చర్చించి.. ముహూర్తం ఫైనల్ చేస్తారని చెబుతున్నారు. మంత్రివర్గ ప్రక్షాళన ఖాయమైతే కొత్తగా ఎవరికి దక్కుతుందనే లెక్కలు ఇప్పటికే మొదలయ్యాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. పార్టీని ధిక్కరించి టీడీపీ అభ్యర్ధికి సహకరించిన ఆ నలుగురి పైన మరింత కఠిన చర్యల దిశగా ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ చర్యలు ఏ విధంగా ఉంటాయనే చర్చ మొదలైంది. సీఎం జగన్ రేపు సాయంత్రం 6 గంటలకు విశాఖ వెళ్లనున్నారు. రుషికొండలోని రాడిసన్ బ్లూ రిసార్ట్స్ చేరుకోనున్నారు. రేపు రాత్రి 7 గంటలకు జీ20 ప్రతినిధులతో సమావేశం కానున్నారు. జీ20 ప్రతినిధులకు ఏర్పాటు చేసిన విందులో సీఎం పాల్గొంటారు. అటు క్రాస్ ఓటింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు వైసీపీ పైన తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు వైసీపీ నాయకత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఉత్కంఠతకు కారణమవుతోంది.












Click it and Unblock the Notifications