రేపు ఢిల్లీకి సీఎం జగన్ - ప్రధానితో భేటీ : రాజధానులు -పొత్తులు: రాష్ట్రపతి ఎన్నిక పైనా..!!
ముఖ్యమంత్రి జగన్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఇప్పటికే ఈ మేరకు అప్పాయింట్ మెంట్ ఖరారు అయింది. సీఎం జగన్ మూడేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న వేళ పాలనా పరంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటుగా.. మంత్రివర్గ ప్రక్షాళనకు సిద్దమయ్యారు. ఇక, ఏపీలో రాజధాని అంశం ..పోలవరం అంశాలు ఇప్పుడు ప్రభుత్వానికి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు తీర్పు పైన ప్రభుత్వం తమ వైఖరి ఏంటనేది..అఫిడవిట్ దాఖలు చేసింది. తాజాగా అసెంబ్లీలోనూ రాజధానుల అంశం పైన చర్చ జరిగింది. న్యాయ పరంగా చర్చలు చేస్తున్నామని.. మూడు రాజధానులే తమ విధామని సభా వేదికగా సీఎం జగన్ స్పష్టం చేసారు.

సీఎంకు ప్రతిష్టాత్మకంగా మారిన పోలవరం
ఇక, ఇదే సమయంలో పోలవరం సవరించిన అంచనాలకు ఇప్పటి వరకు అనుమతులు రాకపోగా.. కొత్తగా వస్తున్న కొర్రీలతో ప్రాజెక్టుకు నిధులు ఆలస్యం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పోలవరంకు నిధులు అంశం పైన సీఎం జగన్ ప్రధానంగా మోదీతో చర్చించనున్నారు. ఇక, ఏపీ ఆర్దికంగా కష్టాల్లో ఉంది. ఆర్దిక సమస్యల నుంచి బయట పడేందుకు కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం ప్రత్యేక మినహాయింపులు కోరుతోంది. అదే విధంగా.. ఏపీకి రావాల్సిన బకాయిలపైన చర్చించనున్నారు. అదనపు రుణ సౌకర్యంతో పాటుగా..కేంద్రం 2022-23 వార్షిక బడ్జెట్ లో రాష్ట్రాలకు లక్ష కోట్ల రుణం ఇచ్చే అంశాన్ని ప్రతిపాదించింది. ఆర్దికంగా ఏపీకి వెసులుబాటు కలిగేలా కేంద్రం ప్రత్యేకంగా అనుమతులు సీఎం జగన్ కోరే అవకాశం ఉంది. ఇక, రాజకీయ అంశాలు ఈ పర్యటనలో ప్రస్తావనకు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.

టీడీపీతో బీజేపీ స్టాండ్ పైనా
ఏపీలో టీడీపీ -జనసేన తిరిగి పొత్తు దాదాపు ఖాయమని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అదే సమయంలో బీజేపీ నేతలు సైతం రాజకీయంగా సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తొలి నుంచి కేంద్ర నిర్ణయాలకు మద్దతుగా నిలుస్తున్న వైసీపీ పైన..ఏపీకి వచ్చిన బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపైన సీఎం జగన్ సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏపీలో ఈ రోజే కొత్త జిల్లాలను సీఎం ప్రారంభించారు. ఇక, త్వరలో రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఎన్డీఏ నుంచి అభ్యర్దికే సీఎం జగన్ గతంలో మద్దతు ప్రకటించారు. ఈ సారి సైతం మద్దతు అంశం పైన ప్రధాని - సీఎం జగన్ పైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు ఏకం అవుతున్నాయి.

రాష్ట్రపతి ఎన్నిక పైనా చర్చకు ఛాన్స్
అదే సమయంలో ఎన్డీఏకు వ్యతిరేకంగా రాష్ట్రపతి అభ్యర్ధిని పోటీ పెట్టే అంశం పైన మంతనాలు సాగుతున్నాయి. ఈ సమయంలో బీజేపీకి దక్షిణాది నుంచి వైసీపీ మద్దతు కీలకంగా మారుతోంది. టీఆర్ఎస్ పూర్తిగా బీజేపీకి వ్యతిరేకంగా మారిన సమయంలో జగన్ పాత్ర కీలకం కానుంది. దీంతో..ఈ భేటీలో జగన్ తాను కేంద్రం నుంచి సాయం అభ్యర్ధిస్తున్నా... కేంద్రం నుంచి ఆ స్థాయిలో మద్దతు రావటం లేదనే అభిప్రాయంతో ఉన్నట్లుగా వైసీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. దీంతో.. ఈ సారి పర్యటనలో ఇక, ఎన్నికలు సమీపిస్తున్న వేళ..పోలవరం తో పాటుగా వెనుకబడిన జిల్లాల డెవలప్ మెంట్ నిధులు..రెవిన్యూ లోటు..ఆర్దికంగా రుణ పరిమితి పెంపు.. మినహాయింపుల పైన ప్రధానితో చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది.

ఏపీ రాజకీయాల్లో కీలకంగా ఢిల్లీ టూర్
అదే సమయంలో రాష్ట్రంలో పొత్తుల విషయంలో మోదీ అభిప్రాయం సైతం స్పష్టమయ్యే ఛాన్స్ ఉందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. వైసీపీ ఇప్పటికే రెబల్ ఎంపీ రఘురామ పైన చర్యల కోసం ఫిర్యాదు చేసింది. ఈ అంశం పైన ఈ పర్యటనలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పాలనా పరంగా కొత్త నిర్ణయాలు..రాజకీయంగా కొత్త అడుగులు వేస్తున్న సమయంలో సీఎం జగన్ నేరుగా ప్రధానితో జరిపే చర్చలు..వాటి ఫలితం ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారనున్నాయి. దీంతో..ఇప్పుడు సీఎం జగన్ ఢిల్లీ పర్యటన పైన ఆసక్తి పెరుగుతోంది.












Click it and Unblock the Notifications