35 లక్షల మహిళల ఖాతాల్లో నగదు జమ - సీఎం జగన్ మరో నిర్ణయం..!!
ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తన సంక్షేమం మరింత పక్కాగా అమలు చేస్తున్నారు. ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైంది. ఈ సమయంలో తనకు వ్యతిరేకంగా జత కట్టిన పార్టీలను ఓడించి..అధికారంలోకి రావటమే లక్ష్యగా ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా కాపునేస్తం నాలుగో విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు చేసారు.
నిడువోలుకు సీఎం జగన్:చంద్రబాబు అరెస్ట్ తో ఏపీ రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది. టీడీపీ-జనసేన పొత్తు అధికారికమైంది. ఈ సమయంలోనే ముఖ్యమంత్రి జగన్ జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఈ నెల 16న వైఎస్సార్ కాపు నేస్తం నిధులను సీఎం జగన్ లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

ఇందుకోసం వ్యూహాత్మకంగా నిడుదవోలును ఎంచుకున్నారు. వరుసగా నాలుగో ఏడాది దాదాపు 35 లక్షల మంది మహిళలకు లబ్ది జరగనుంది. కొద్ది రోజులుగా ఈ కార్యక్రమం వాయిదా పడుతోంది. ఇప్పుడు నిడుదవోలు లో సీఎం జగన్ పర్యటన వేళ రోడ్ షోకు స్థానిక నేతలు ప్లాన్ చేస్తున్నారు. పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. రాజకీయంగా గోదావరి జిల్లాలు కీలకంగా మారుతున్నాయి.
కాపు నేస్తం నిధులు విడుదల:రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల లోపున్న మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15వేల చొప్పున సాయం అందిస్తోంది. అంటే ఐదేళ్లలో మొత్తం రూ.75,000 ఆర్థిక సాయం మహిళలకు ఇస్తోంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో జరిగే కార్యక్రమంలో సీఎం బటన్ నొక్కి లబ్ధిదారుల అకౌంట్‌లలో డబ్బుల్ని జమ చేస్తారు. తొలి రెండు విడతల్లో రూ 490 కోట్లు చొప్పున, మూడో విడతలో 3,38,792 మంది మహిళ ఖాతాల్లో రూ.508 కోట్లు సీఎం జగన్ జమ చేసారు.
కాపు నేస్తం పథకంపై మూడేళ్లలో రూ.1,492 కోట్లు ఖర్చు చేశారు. మేనిఫెస్టోలో చెప్పకపోయినా వైఎస్ఆర్ కాపునేస్తం పేరుతో ప్రభుత్వం ఏడాదికి రూ.15 వేల చొప్పున జమ చేస్తోంది. తాజాగా నిర్వహించిన జగన్న సురక్ష ద్వారా అర్హత ఉంది పథకం అందని లబ్దిదారులకు మరో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సీఎం ప్రసంగంపై ఆసక్తి:నవరత్నాల్లో పథకాల ద్వారా మూడేళ్లలో కాపు సామాజిక వర్గానికి రూ.16,256 కోట్లు లబ్ధి చేకూర్చినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటి వరకు సీఎం గా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత 50 నెలల కాలంలో రూ 2.45 లక్షల కోట్ల మేర వివిధ పథకాల ద్వారా లబ్దిదారులకు ప్రభుత్వం నుంచి మేలు జరిగింది.
ఇప్పుడు వరుసగా నాలుగో ఏడాది నిధులను రాజకీయంగా కీలకమైన గోదావరి జిల్లా నుంచి సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ఎన్నికల పొత్తుల్లో భాగంగా టీడీపీ, జనసేన సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకున్నాయి. గోదావరి జిల్లాల్లో సామాజిక సమీకరణాలను అనుకూలంగా మలచుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పుడు సీఎం జగన్ నిడుదవోలు కేంద్రంగా కాపునేస్తం నిధుల విడుదల..బహిరంగ సభలో చేసే ప్రసంగం పైన ఆసక్తి కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications