AP Govt: ఉద్యోగుల సర్వీస్ రికార్డులపై సర్కార్ కీలక నిర్ణయం-ఉత్తర్వులు జారీ..!
ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం సాధారణంగా ఎదుర్కొనే సమస్యల్లో సర్వీస్ రికార్డుల నిర్వహణ కూడా ఒకటి. సర్వీస్ రికార్డుల్ని దశాబ్దాలుగా పేపర్లు, పుస్తకాల రూపంలో నిర్వహిస్తుండటం వల్ల వారికి సర్వీసులో ఉన్నప్పుడు, రిటైర్మెంట్ తర్వాత కూడా ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం (AP Govt) వాటిని డిజిటలైజ్ చేసే ప్రక్రియను ప్రారంభించింది. ఇందుకోసం ఈ-ఎస్ఆర్ 2.0 (E-SR 2.0) విధానాన్ని అమల్లోకి తెస్తూ ఇవాళ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ ఉద్యోగుల ఫిజికల్ సర్వీస్ రిజిస్టర్లను (Service Registers) పూర్తిగా డిజిటల్ రూపంలోకి మార్చి, భవిష్యత్తులో అన్ని సేవా అంశాలను e-SR 2.0 (Electronic Service Register) ద్వారా నిర్వహించాలని ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వ మానవ వనరుల నిర్వహణ మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా, పూర్తిగా డిజిటల్ విధానంలోకి మారనుంది. 2018లో ప్రభుత్వం ఫిజికల్ సర్వీస్ రిజిస్టర్ల స్థానంలో e-SR అమలుకు నిర్ణయం తీసుకుంది. 2020లో e-SR వ్యవస్థ ప్రారంభమైనప్పటికీ, కోవిడ్-19, ఇతర పాలనా కారణాల వల్ల అన్ని శాఖల్లో పూర్తి స్థాయిలో అమలు కాలేదు.

ప్రస్తుతం అమలులో ఉన్న e-HRM, Retirement Benefits Processing System (RBPS), Payroll వ్యవస్థలతో సమన్వయం కల్పించేందుకు e-SR 2.0ను ప్రభుత్వం రూపొందించింది. ప్రభుత్వ ఉద్యోగుల సేవా రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరచడం, అన్ని సేవా వివరాలకు ఒకే ప్రామాణిక డేటాబేస్ ఏర్పాటు చేయడం, పేరోల్, పదోన్నతులు, పే ఫిక్సేషన్, సెలవులు, పెన్షన్ తదితర ప్రక్రియలను వేగవంతం చేయడం, మానవ తప్పిదాలను తగ్గించి పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచడం దీని ముఖ్య ఉద్దేశాలు.
తాజా ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగులు/అధికారులు చేయాల్సిన పనుల్ని ప్రభుత్వం జీవోలో వెల్లడించింది. ఫిజికల్ సర్వీస్ రిజిస్టర్‌ను స్కాన్ చేయాలి, స్కాన్ చేసిన సర్వీస్ రిజిస్టర్‌ను e-SR 2.0లో అప్లోడ్ చేయాలి, సర్వీస్ రిజిస్టర్‌లోని అన్ని సేవా వివరాలను నమోదు చేయాలి, అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి, నమోదు చేసిన వివరాలను జాగ్రత్తగా పరిశీలించి సమర్పించాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఉద్యోగి నమోదు చేసిన వివరాలను స్కాన్ చేసిన సర్వీస్ రిజిస్టర్‌తో సరిపోల్చి పరిశీలించాలని చెకర్ ను ఆదేశించింది. అవసరమైతే సవరణలు చేయించి, వివరాలను హెచ్ఆర్ మేనేజర్ కు పంపాలని, వారు వివరాలను తుది స్థాయిలో పరిశీలించి ఆమోదించాలని తెలిపింది.
తొలిదశలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో ఇవాళ్టి నుంచి e-SR 2.0 ప్రారంభించారు. ఆగస్టు 5వ తేదీ వరకూ ఇక్కడ ఉద్యోగుల డేటా నమోదు, స్కాన్ చేసిన SR అప్లోడ్ చేస్తారు. అలాగే ఈ నెల 25 నుంచి ఆగస్టు 31 వరకూ చెకర్ ధృవీకరిస్తారు. అలాగే హెచ్ఆర్ మేనేజర్ ఆమోదిస్తారు. సెప్టెంబర్ 1 నుంచి అన్ని కొత్త సర్వీస్ ఈవెంట్లు తప్పనిసరిగా e-SRలోనే నమోదు చేయాలని ఆదేశించారు. రెండో దశలో మిగిలిన ప్రభుత్వ కార్యాలయాల్లో దీన్ని అమలు చేస్తారు. ఆగస్టు 1 నుంచి ఇలా మిగిలిన ఆఫీసుల్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆగస్టు 15 వరకూ డేటా నమోదు, ఆగస్టు 5 నుంచి 31 వరకూ ధృవీకరణ, ఆమోదం చేపడతారు. అనంతరం సెప్టెంబర్ 1 నుంచి e-SR ద్వారా సేవా అంశాల నమోదు తప్పనిసరి చేస్తారు.

ఇందులో వార్షిక ఇంక్రిమెంట్లు, ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ , పే ఫిక్సేషన్స్, పదోన్నతులు, బదిలీలు, సెలవులు
సస్పెన్షన్, Reinstatement, ప్రొబేషన్ డిక్లరేషన్, వేతనం లేదా సేవా పరిస్థితులపై ప్రభావం చూపే ఇతర అన్ని సేవా అంశాలు నమోదు చేస్తారు. కాబట్టి అన్ని శాఖలు, జిల్లా కలెక్టర్లు, హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్లు, హెడ్ ఆఫ్ ఆఫీసులు, DDOలు, HR Managers నిర్ణీత గడువులోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. APCFSS సాంకేతిక సహాయం, యూజర్ మాన్యువల్స్, శిక్షణ అందించి e-SR 2.0 అమలును పర్యవేక్షించాలని ప్రభుత్వం తెలిపింది.












Click it and Unblock the Notifications