రేపు 52.31 లక్షల మంది ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం జగన్..!!
ముఖ్యమంత్రి జగన్ రేపు (గురువారం) కర్నూల జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని పత్తికొండలో ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రైతు భరోసా సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఎన్నికల ఏడాదిలో సీఎం జగన్ పథకాల అమలు సమయంలోనే రాజకీయంగా మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ మహానాడులో ప్రకటించిన మేనిఫెస్టోలో రైతులకు ఏడాదికి రూ 20 వేల సాయం అందిస్తామని ప్రకటించారు. ఇప్పుడు పత్తికొండ సభలో సీఎం జగన్ టీడీపీ మేనిఫెస్టో పైన స్పందించే అవకాశం కనిపిస్తోంది.
పత్తికొండకు సీఎం జగన్ : ముఖ్యమంత్రి జగన్ నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. ఎన్నికల ఏడాదిలో వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. తన సంక్షేమ హామీలను క్యాలెండర్ ప్రకారం అమలు చేస్తున్నారు. అందులో భాగంగా రేపు (గురువారం) సీఎం జగన్ కర్నూలు జిల్లా పత్తికొండ వేదికగా వైఎస్ఆర్ రైతు భరోసా సాయాన్ని సీఎం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత పెట్టుబడి సాయంగా 52. 31 లక్షల మందికి 7, 500 చొప్పున 3, 934 కోట్లను బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. అలాగే మార్చి , ఏప్రిల్ , మే నెలల్లో కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు రూ. 46. 39 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అందించనున్నారు.
వైఎస్సార్ రైతు భరోసా : వైఎస్సార్ రైతు భరోసా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.7500, కేంద్ర ప్రభుత్వం రూ.6000 విరాళంగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధితో కలిపి సంవత్సరానికి 13,500 రూపాయల మొత్తాన్ని మూడు విడతలుగా జమ చేయడం ద్వారా రైతులకు ఆర్థికంగా సహాయం అందిస్తోంది. ప్రతీ ఏటా ఆరు వేల కోట్లకు పైగా సాయం అందిస్తోంది.
2019 అక్టోబర్ 15న ముఖ్యమంత్రి జగన్ ఈ పథకం అమలు ప్రారంభించారు. ఈ సారి రైతులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పంది. రైతు భరోసా అర్హత కలిగి వివిధ కారణాలతో లబ్ది పొందని వారికి మరో అవకాశం కల్పించింది. 2023-24 ఏడాది మొదటి విడత రైతు భరోసా దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం కల్పించింది. రైతు భరోసాకు కొత్తగా అర్హత పొందిన రైతులు, అటవీ భూమి సాగుదారులు.. ఈ నెల 15 నుంచి 18 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం జగన్ : ఈ ఏడాదికి కొత్తగా 90,856 మంది భూయజమానులు, 6,642 మంది అటవీ భూమి సాగుదారులు కొత్తగా అప్లై చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. గతేడాది లబ్ధి పొందిన వారు, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హుల, అనర్హుల జాబితాలను రైతు భరోసా కేంద్రాల్లో ఉంచారు. టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా మహానాడు వేదికగా ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు.
అందులో రైతులకు రూ 20 వేల చొప్పున ప్రతీ ఏటా సాయం అందిస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు పత్తికొండ బహిరంగసభలో ముఖ్యమంత్రి జగన్ టీడీపీ మేనిఫెస్టో పైన స్పందించే అవకాశం ఉంది. చంద్రబాబు మహిళలు,యువత, రైతులకు సంబంధించిన ఇచ్చిన హామీలపై సీఎం జగన్ ను ఎన్నికల వేళ ఏ విధంగా కౌంటర్ చేస్తారనేది ఆసక్తిగా మారుతోంది.












Click it and Unblock the Notifications