లబ్దిదారుల ఖాతాల్లో రేపు నగదు జమ చేయనున్న సీఎం జగన్..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం రాజుకుంటోంది. అధికారంలోకి వచ్చిన సమయం నుంచి సీఎం జగన్(CM YS Jagan) తాను హామీ ఇచ్చిన పథకాలను అమలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ సంక్షేమమే మరోసారి అధికారం అందిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల్లో తన సంక్షేమాన్ని మరింత పక్కాగా కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా రేపు (శుక్రవారం) విజయవాడ కేంద్రంగా వాహన మిత్ర(YSR Vahana Mitra) లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.
వాహనమిత్ర పథకంతో: రవాణా రంగంలో స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని (YSR Vahana Mitra 2023) రాష్ట్ర ప్రభుత్వం వరుసగా అయదో విడత అందించనుంది. ఇందులో భాగంగా సీఎం జగన్ విజయవాడ నుంచి వైఎస్సార్ వాహన మిత్ర నిధులు విడుదల చేయనున్నారు.

2022-23కుగాను ఈ పథకం కింద 2,61,516 మంది అర్హులైన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సిక్యాబ్ డ్రైవర్లకు ఈ ప్రయోజనం కల్పించింది. ఈ సారి వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఒక్కో లబ్దిదారునికి రూ.10వేల చొప్పున శుక్రవారం సీఎం వైఎస్ జగన్ బటన్‌నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తారు.
నిధులు విడుదల: తొలుత ఈ కార్యక్రమం కాకినాడ నుంచి చేయాలని భావించినా..ఇప్పుడు విజయవాడలో నిర్వహించాలని నిర్ణయించారు. శుక్రవారం విజయవాడలో విద్యాధరపురం స్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం జగన్ ఈ పథకంలో పాల్గొంటారు. అనంతరం సభలో ప్రసంగిస్తారు. ఇప్పటి వరకు విడుదల చేసిన నాలుగు విడతల 'వైఎస్సార్ వాహన మిత్ర' పథకం (YSR Vahana Mitra ) ద్వారా లబ్ధిదారులకు రూ.1,026 కోట్లను పంపిణీ చేసింది. జగనన్న సురక్ష ద్వారా పథకాలకు అర్హత ఉండి అందుకోలేకపోతున్న వారిని గుర్తించారు. అటువంటి వారినీ ఈ సారి లబ్ది దారుల జాబితాలో చేర్చారు.
పథకాల అమలుతో: అర్హులైన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ గల డ్రైవర్లకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. లబ్ది దారుల జాబితాలను ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు అర్హులైన జాబితాలను ప్రకటించారు.
ఇక, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో విజయవాడ కేంద్రంగా ముఖ్యమంత్రి సభలో చేసే ప్రసంగం పైనా ఆసక్తి నెలకొంది. అటు చంద్రబాబు అరెస్ట్..ఇటు ఎన్నికలకు వైసీపీ సిద్దం అవుతున్న సమయంలో ముఖ్యమంత్రి ఏం చెప్పబోతున్నారనేది కీలకంగా మారనుంది. అదే సమయంలో ఇక ప్రజల్లోకి వెళ్లేలా కొత్త కార్యక్రమానికి సీఎం సిద్దం అవుతన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications