భయపడను, అనుకుంటే చేస్తా: కెసిఆర్, మొదటి ఇల్లు మల్లమ్మకే..
హైదరాబాద్: తాను ఎవరికీ భయపడనని, జగమొండినని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. తాను చేయాలనుకున్నది చేసి తీరుతానని చెప్పారు. చిల్లర రాజకీయాలు మానుకుని, అందరూ అభివృద్ధికి సహకరించాలని అన్నారు. శుక్రవారం సాయంత్రం ఎన్‌బిటికాలనీలో జరిగిన పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలువురు పేదలకు పట్టాలు పంపణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీలో ఉదయంపూట నీళ్లు వస్తున్నాయా? అని అడిగారు. మహిళల పేరునే భూముల పట్టాలను ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఎవరూ ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదని, ఎవరికీ లంచం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని అన్నారు. ప్రభుత్వం ఖర్చుతోనే పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి ఇస్తామని చెప్పారు.
నగరంలో రూ. 10వేల కోట్ల విలువ చేసే భూముల పట్టాలిచ్చామని తెలిపారు. ఇచ్చిన భూములను ఎవరికీ అమ్మొద్దని చెప్పారు. కాలనీ భూములు బంజారాహిల్స్ భూముల ధరతోనే ఉంటాయని అన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు పట్టా భూములిచ్చి, పక్కా ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు.

ఒకే రోజు 1.25వేల మందికి పట్టాల పంపిణీ జరిగిందని అన్నారు. గుడిసెలో ఉన్నవారందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. నగరంలో లక్ష మంది రైల్వే స్టేషన్లు, స్మశానాలు, ఫుట్ పాత్‌లపై జీవిస్తున్నారని అన్నారు.
ఎన్ బిటి కాలనీకి ఓ కమ్యూనిటీ హాల్ మంజూరు చేస్తున్నామని, దాన్ని మీరే చూసుకోవాలని చెప్పారు. లిఫ్టులు పెట్టి భవనాలు కట్టిస్తామని చెప్పారు. కొందరు ఏం చేయలేదని, తమను కూడా చేయొద్దని అంటున్నారని అన్నారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ చెప్పినట్లుగానే మహిళ పేరు మీదే పట్టాలు ఇస్తున్నామని చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ అనే బృహత్తర కార్యక్రమం చేపట్టారని అన్నారు. దాన్ని ఆదర్శంగా తీసుకునే స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణ చేపట్టామని చెప్పారు. నెలకోసారి నగరంలో ఈ కార్యక్రమం ఉంటుందని.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వస్తారని చెప్పారు. పేదలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ప్రతీ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు.
మల్లమ్మకే మొదటి ఇల్లు: కెసిఆర్
బంజారాహిల్స్ ఎన్‌బీటీ నగర్‌లో 800 నుంచి వెయ్యి మంది కూర్చునేందుకు వీలుగా ఉండే భవనానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అయితే భవనం కట్టే ప్రాంతంలో పాలమూరుకు చెందిన మల్లమ్మ మూడు నెలల క్రితం గుడిసె వేసుకుంది. భవన నిర్మాణం కోసం అధికారులు గుడిసెను తీసేయాలని భావించారు. అయితే మల్లమ్మకు కొత్త ఇల్లు నిర్మించే వరకు గుడిసెను తీసేయొద్దని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఎన్‌బీటీ నగర్‌లో మొదటి ఇల్లు మల్లమ్మకే కట్టించాలని ఆదేశించారు. ఆ తర్వాతే మిగతా వారికి ఇళ్లు కట్టించాలని చెప్పారు. లేకపోతే ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి వెంబడి పడుతానని సీఎం అన్నారు. ఈ సందర్భంగా పాలమూరు మల్లమ్మ సీఎం కేసీఆర్‌కు నమస్కరించారు. భవనానికి శంకుస్థాపన సమయంలో మల్లమ్మ కేశవరావుతో మాట్లాడుతూ.. సార్, కేసీఆర్ సార్ ఉన్నంత వరకు నాకు ఇల్లు ఎక్కడ పోదు అని చెప్పింది.












Click it and Unblock the Notifications