సీఎం వర్సెస్ ఎన్నికల సంఘం: మధ్యలో సీఎస్ సతమతం: ఆదేశాలు అమలవుతాయా...!
అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కొత్త వివాదానికి కారణమైంది. ఎన్నికల సంఘం నిర్ణయంతో ఇప్పుడు ఏపీ ప్రభుత్వ విభేదిస్తోంది. ఏకంగా ముఖ్యమంత్రి జగన్ నేరుగా ఎన్నికల కమిషనర్ పైన విరుచుకుపడ్డారు. ఆయన పైన చర్యలు తీసుకోవలని కోరుతూ గవర్నర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసారు. దీని పైన అవసరమైతే ముందుకు వెళ్తామని స్పష్టంగా చెప్పారు.
ఎన్నికలు వాయిదా వేసిన కమిషనర్..అధికారుల పైన చర్యలు ఎలా తీసుకుంటారని ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నారు. దీంతో..ఎన్నికల సంఘం కొందరు అధికారుల పైన చర్యలకు ఆదేశించింది. అయితే, ఆ నిర్ణయాలను సీఎం తప్పుబడుతున్నారు. దీంతో..ఎన్నికల సంఘం ఆదేశాలను అమలు చేయాలా..లేక ముఖ్యమంత్రి మనోభీష్టం మేరకు అమలు చేయకుండా ఉండాలా...ఏ నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుందనే మీమాంసలో సీఎస్ ఉన్నారు. దీంతో..ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది..

ఎన్నికల సంఘం ఆదేశాలను వ్యతిరేకిస్తున్న సీఎం జగన్
స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూనే..అదే సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారుల పైన చర్యలు ప్రకటించింది. చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, గుంటూరు రూరల్, తిరుపతి అర్బన్ ఎస్పీలు, పలమనేరు డీఎస్పీ, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలను బదిలీ, మాచర్ల సీఐని సస్పెండ్ చేయాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ ఆదేశించారు. ఇప్పుడు ఈ ఆదేశా లను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంటుంది. అయితే, మొత్తంగా ఆ నిర్ణయాన్నే స్వయంగా ముఖ్యమంత్రే వ్యతిరేకిస్తున్న సమయంలో ఇప్పుడు ఈ ఆదేశాలు సైతం అమలు చేయాలంటే అధికారులు మీమాంసలో పడ్డారు.

ఎన్నికల సంఘం ఆదేశాలు..అమలవుతాయా
సాధారణంగా ఈ ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పైనే ఉంటుంది. అయితే, స్వయంగా ముఖ్యమంత్రి ఆ నిర్ణయాలను వ్యతిరేకించటంతో.. ఆ ఆదేశాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెనుకడుగు వేశారా అన్న అనుమానాలు వస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు ప్రభుత్వం అమలుచేయకపోతే కొత్త చిక్కులు వచ్చిపడతాయి. తమ ఆదేశాలను ప్రభుత్వం ఖాతరు చేయని పక్షంలో ఎన్నికల కమిషన్ హైకోర్టును ఆశ్రయించవచ్చు.
Recommended Video

కొత్త సంక్షోభానికి కారణమవుతుందా..
రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆ అధికారాలే లేవని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించటంతో ఇప్పుడు ఈ వ్యవహారం సున్నితంగా మారింది. అయితే, తమకు ఉన్న విచక్షణాధికారం మేరకు నిర్ణయం తీసుకుంటున్నామని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది. ఎస్‌ఈసీ ఆదేశాల అమలు గురించి జీఏడీ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్‌ను సంప్రదించగా, ఆయన స్పందించలేదు. ఇటీవల డీజీపీని, ఎస్‌ఈసీని కోర్టు తీవ్రంగా మందలించిన నేపథ్యంలో తాజాగా ఎస్‌ఈసీ ఆదేశాల అమలును అధికారులు అమలు చేస్తారా.. లేక ముఖ్యమంత్రి సూచనల మేరకే నడుచుకుంటారా అనేది ఆసక్తిగా మారింది. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎస్‌ఈసీ ఆదేశాలు అమలు చేయని అధికారులపై కోర్టులు తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. దీంతో ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు ఇప్పుడు ఏంచేయాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. దీని పైన ఈ రోజు న్యాయ నిపుణులతో చర్చించటంతో పాటుగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications