డీఎంకె అధినేత స్టాలిన్‌కు సీఎం జగన్ ఫోన్... ఎన్నికల్లో విజయానికి అభినందనలు...
తమిళనాడులో విజయం దిశగా దూసుకెళ్తున్న డీఎంకెకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డీఎంకె అధినేత స్టాలిన్‌కు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. తమిళ ఓటర్ల నమ్మకాన్ని పొందినందుకు అభినందనలు తెలిపారు.
మొత్తం 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో ప్రస్తుతం డీఎంకె 150 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మ్యాజిక్ ఫిగర్ 117ని దాటడంతో డీఎంకె విజయం ఇప్పటికే ఖరారైంది. డీఎంకె గెలుపుతో స్టాలిన్ మొదటిసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు.

తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా విజయం సాధించారు. డీఎంకె కంచుకోట,తన తాత కరుణానిధి నియోజకవర్గమైన చెపాక్ నియోజకవర్గం నుంచి ఉదయనిధి స్టాలిన్ గెలుపొందారు. దీంతో తాతకు తగ్గ మనవడిగా ఉదయనిధి స్టాలిన్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.
1996,2001,2006 అసెంబ్లీ ఎన్నికల్లో కరుణానిధి చెపాక్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అందులో రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత చెపాక్,ట్రిప్లికేన్ ప్రాంతాలను విలీనం చేయగా... 2011,2016 అసెంబ్లీ ఎన్నికల్లోనూ డీఎంకెనే ఇక్కడ విజయం సాధించింది. తాజాగా ఉదయనిధి స్టాలిన్ ఆ గెలుపు పరంపరను కొనసాగించినట్లయింది.
తమిళనాడులో పదేళ్ల అన్నాడీఎంకె పాలనపై ఉన్న వ్యతిరేకత,నాయకత్వ లోపాలు డీఎంకెకి కలిసొచ్చాయి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా డీఎంకెదే విజయమని గతంలోనే పలు సర్వేలు వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్స్‌లోనూ అదే వెల్లడైంది. తాజా ఫలితాలు కూడా అదే నిరూపిస్తున్నాయి. డీఎంకె విజయంతో చెన్నైలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే కరోనా మహమ్మారి నేపథ్యంలో సంబరాలు వద్దని పార్టీ అధిష్ఠానం ఒక ప్రకటన విడుదల చేసింది. ముందు మనల్ని మనం కాపాడుకుంటేనే రాష్ట్రాన్ని కాపాడుకుంటామని... ప్రతీ ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని సూచించింది.












Click it and Unblock the Notifications