ముందస్తుకు కసరత్తు?: ఎన్నికల మూడ్‌లో వైఎస్ జగన్: ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మూడ్‌లోకి వెళ్లినట్టే. గడువు కంటే ముందే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందనే విషయంపై ఆయన దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. తెలంగాణ తరహాలో ముందస్త ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందనే విషయంపై ఆయన ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వల్ల రాజకీయంగా ఏర్పడే లాభనష్టాలపై బేరీజు వేస్తోన్నారని సమాచారం.

మంత్రివర్గ భేటీలో కీలక వ్యాఖ్యలు..
సోమవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశం సందర్భంగా వైఎస్ జగన్.. తన అభిప్రాయాలను సహచరులతో పంచుకున్నారు. మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలను ఉద్దేశించి కీలక వ్యఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు రెండు సంవత్సరాల సమయం ఉన్నందున- ఇప్పటి నుంచే నిత్యం జనం మధ్యన ఉండేలా ప్రణాళికలను వేసుకోవాలని సూచించారు. ఇప్పటిదాకా తమ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ఒక అడుగు ముందే..
తెలుగుదేశం పార్టీ- తనకు అండదండగా ఉంటూ వస్తోన్న మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడంలో ఒక అడుగు ముందే ఉందని వైఎస్ జగన్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అనుకూల మీడియా ద్వారా టీడీపీ చేస్తోన్న విష ప్రచారాన్ని తిప్పి కొట్టాలని, వాస్తవాన్ని ప్రజలకు వివరించాలని మంత్రులకు సూచించారు. ప్రతి ఎమ్మెల్యే కూడా 24 గంటల పాటు తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండలాని అన్నారు.

త్వరలోనే సభాపక్ష సమావేశం
వీలైనంత త్వరగా శాసన సభాపక్ష సమావేశాన్ని నిర్వహిస్తానని వైఎస్ జగన్- మంత్రులకు సూచించారు. కొందరు ఎమ్మెల్యేలు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండట్లేదనే విషయం తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడం వల్ల ఆ నియోజకవర్గంలో టీడీపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని, ఓటర్లను తన వైపునకు తిప్పుకొనేలా కార్యక్రమాలను నిర్వహిస్తోందనే విషయం మంత్రులకు తెలిసే ఉంటుందని వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ పరిస్థితులు రాకుండా చూసుకోవాలని సున్నితంగా హెచ్చరించినట్లు తెలుస్తోంది.

గ్రామ స్థాయి నుంచి పార్లమెంటేరియన్ల వరకు
గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ వరకు పార్టీకి చెందిన ప్రతి ప్రజా ప్రతినిధి అన్ని వేళల్లో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందేనని వైఎస్ జగన్ సూచించారు. నవరత్నాలు పార్టీకి మూలాధారాలని, వాటిపై ఎలాంటి చెడ్డపేరు రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలపై ఉందని చెప్పారు. టీడీపీ చేస్తోన్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టడంతో పాటు నవరత్న పథకాల ప్రయోజనాల గురించి ప్రజలకు వివరించాలని అన్నారు. ఇప్పటికే కోట్లమంది లబ్దిదారులు ఆయా పథకాల ద్వారా లబ్ది పొందారని గుర్తు చేశారు.
Recommended Video

తాను సైతం..
ఇకపై తాను కూడా నిత్యం ప్రజల్లోనే ఉంటానని వైఎస్ జగన్.. మంత్రులకు భరోసా ఇచ్చారు. త్వరలోనే పూర్తిస్థాయిలో జిల్లాల పర్యటనకు తాను శ్రీకారం చుడతానని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికీ వెళ్లేలా తన పర్యటనను షెడ్యూల్ చేసుకుంటానని ఆయన తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. వచ్చే రెండు సంవత్సరాల కాలం రాజకీయంగా పార్టీకి, ప్రభుత్వానికీ అత్యంత విలువైనదని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications