ఎస్సీ హాస్టల్స్ ఎంప్లాయిస్ కు జగన్ గుడ్ న్యూస్
పోస్ట్ మెట్రిక్ ఎస్సీ హాస్టళ్లలో ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న ఉద్యోగులు ఎదుర్కొంటున్న వేతన సమస్యను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిష్కరించారు.
అమరావతి: సుదీర్ఘకాలంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోస్ట్ మెట్రిక్ ఎస్సీ హాస్టళ్లలో ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న ఉద్యోగులు ఎదుర్కొంటున్న వేతన సమస్యను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిష్కరించారు. ఇకపై వారికి సకాలంలో వేతనాలు అందేలా ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఒకట్రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉంది.
పోస్ట్ మెట్రిక్ ఎస్సీ హాస్టళ్లల్లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పని చేస్తోన్న ఉద్యోగుల సర్వీసులను అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ కు అనుసంధానం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు శాఖలు, విభాగాల్లో పని చేస్తోన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ ఇది. ఈ కార్పొరేషన్ తో వారి సేవలను అనుసంధానం చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

రాష్ట్రవ్యాప్తంగా 160 పోస్ట్ మెట్రిక్ ఎస్సీ హాస్టళ్లు ఉన్నాయి. వాటిల్లో వంటపని, పారిశుద్ధ్యం ఉద్యోగులుగా పని చేస్తున్న వారిలో 411 మందికి థర్డ్ పార్టీ ప్రైవేట్ మ్యాన్ పవర్ సంస్థల ద్వారా వేతనాలు అందుతున్నాయి. ఈ ప్రైవేట్ సంస్థలు వారికి సకాలంలో వేతనాలను చెల్లించడంలో విఫలమౌతోన్నాయి. ఫలితంగా వారు ఉద్యోగాలను వదిలిపెడుతున్నారు.
దీనివల్ల పోస్ట్ మెట్రిక్ ఎస్సీ హాస్టళ్లల్లో ఉండే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. ఈ విషయాన్ని మంత్రి మేరుగ నాగార్జున.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని శాశ్వతంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలంటూ ఆయన అధికారులను ఆదేశించారు. జగన్ ఆదేశాల మేరకు ఈ నేపథ్యంలోనే ఆయా ప్రైవేట్ మ్యాన్ పవర్ సంస్థల ఆధీనంలో పని చేస్తోన్న 411 మంది ఉద్యోగుల సేవలను అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ తో అనుసంధానించాలని అధికారులు నిర్ణయించారు.
ప్రీ మెట్రిక్ ఎస్సీ హాస్టళ్లకు ఇదివరకే మంజూరైన పోస్టుల స్థానంలో వారి సేవలను ఉపయోగించుకోనున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆప్కాస్‌కు అనుసంధానం చేసిన 411 మంది పోస్ట్ మెట్రిక్ ఎస్సీ హాస్టల్ ఉద్యోగులలో 37 మందిని శ్రీకాకుళం, 52 మందిని విజయనగరం, 17 మందిని విశాఖపట్నం, 120 మందిని తూర్పుగోదావరి, 82 మందిని కృష్ణా,62 మందిని ప్రకాశం, 41 మందిని అనంతపురం జిల్లాల్లోని హాస్టళ్లకు కేటాయించారు.












Click it and Unblock the Notifications