Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ ప్రజల ఆందోళనలను పరిగణలోకి తీసుకోండి: ప్రధాని మోదీకి జగన్ లేఖ

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రెండో రోజు- వామపక్ష ఉగ్రవాదంపై కేంద్ర హోం శాఖ నిర్వహించిన సదస్సుకు హాజరయ్యారు. రాత్రి ఆ శాఖ మంత్రి అమిత్ షానూ కలిశారు. ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హామీల అమలుపై చర్చించారు. శనివారం నాటితో ఆయన పర్యటన ముగుస్తుంది. మధ్యాహ్నం తాడేపల్లికి చేరుకుంటారు వైఎస్ జగన్.

ఈ సందర్భంగా- ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వైఎస్ జగన్ లేఖ రాశారు. కృష్ణా జలాల అంశాన్ని తన లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు. కృష్ణా జలాల పంపకాల విషయంలో ఏపీ ప్రజల ఆందోళనలను పరిగణలోకి తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. తదుపరి చర్యలు తీసుకోకుండా నిలిపేయాలని కోరారు.

1956 నాటి అంతర్‌ రాష్ట్ర నదీజలాల వివాద చట్టం ప్రకారం- కృష్ణా జలవివాద ట్రిబ్యునల్‌ -1 (బచావత్‌)ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ఈ ట్రిబ్యునల్ ఇచ్చిన తుది నివేదిక ఆధారంగా 1976 మే 31వ తేదీన గెజిట్‌ చేసిందని పేర్కొన్నారు. కృష్ణానదిలో 2,130 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందని ట్రిబ్యునల్ లెక్క కట్టినట్లు తెలిపారు.

YS Jagan

దీని ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌కు 811 టీఎంసీల నీటిని కేటాయించిందని, 2,130 టీఎంసీల కన్నా అధికంగా ఉన్న నీటిని, మిగులు ప్రవాహాలను ఉపయోగించుకునేలా ఏపీకి స్వేఛ్చను కల్పించిందని పేర్కొన్నారు. అంతర్‌ రాష్ట్ర నదీజలాల వివాద చట్టం- 1956లోని సెక్షన్ 6(1) ప్రకారం, ట్రిబ్యునల్- 1 పంచిన ఈ వాటాలు సుప్రీంకోర్టు డిక్రీ ద్వారా అమల్లోకి వచ్చాయనీ వివరించారు.

దీని తరువాత- అంతర్‌ రాష్ట్ర నదీజలాల వివాద చట్టం- 1956లోని సెక్షన్ 4 (1) ప్రకారం 2004 ఏప్రిల్ 2వ తేదీన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2 ఏర్పాటైందని వైఎస్ జగన్ అన్నారు. ఈ ట్రిబ్యునల్‌ 2010 డిసెంబర్ 30వ తేదీన తన నివేదికను సమర్పించిందని, 75 శాతం డిపెండబిలిటీతో చేసిన 2,130 టీఎంసీల కేటాయింపులను నిర్ధారించిందని వివరించారు.

దీనితో పాటు కృష్ణా బేసిన్ రాష్ట్రాలకు సగటు ప్రవాహాలతో సహా 65 శాతం డిపెండబిలిటీతో అదనపు నీటిని కూడా కేటాయించిందని, దీని కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 194 టీఎంసీలను కేటాయించిందని జగన్ చెప్పారు. ఉమ్మడి ఏపీకి చేసిన మొత్తం కేటాయింపు 1,005 టీఎంసీలని పేర్కొన్నారు.

అలాగే- 2,578 టీఎంసీల కంటే ఎక్కువుగా ఉండే అదనపు ప్రవాహాలను ఉపయోగించుకునే స్వేచ్ఛ ఉమ్మడి ఏపీకి ఉందని అన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కృష్ణా నదీజలాలపై ఆధారపడ్డ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్లను దాఖలు చేశాయని గుర్తు చేశారు. అవన్నీ పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు.

ఈ సమస్యను జల్‌శక్తి మంత్రిత్వ శాఖ దృష్టికి రెండుసార్లు అంటే 2021 ఆగస్టు, 2022 మేలో తీసుకువచ్చానని జగన్ అన్నారు. ట్రిబ్యునల్‌ ద్వారా జరిగిన కేటాయింపులకు ఎలాంటి భంగం రాకుండా చట్టపంగా న్యాయబద్ధమైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాజాగా అంతర్‌ రాష్ట్ర నదీజలాల వివాద చట్టం, ట్రిబ్యునల్ 2 విధి విధానాలను ఖరారు చేయడానికి ఉద్దేశించిన ప్రతిపాదనలపై కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు.

2014 జులై 4వ తేదీన తెలంగాణ ప్రభుత్వం చేసిన అభ్యర్థన, ఫిర్యాదు ప్రకారంగా ఈ విధివిధానాలు కేవలం ఏపీ, తెలంగాణలకే పరిమితం చేశారని అన్నారు. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కృష్ణానది ప్రవాహాలపై ఆధారపడిన ఏపీ ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగే అవకాశం ఉందంటూ వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.

PM Modi

ఏపీ, తెలంగాణకు మాత్రమే ఈ విధి విధానాలను పరిమితం చేయడం, కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ఇతర రెండు రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటకలను పూర్తిగా మినహాయించాలని ఏకపక్షంగా సూచించడం అశాస్త్రీయమని జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది- జాతీయ ఆస్తి అయిన నీటి వనరులను న్యాయంగా వినియోగించుకోవడానికి వ్యతిరేకం కూడానని అన్నారు.

ఆయా వాస్తవ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని, ఇందులో ఉన్న న్యాయపరమైన చిక్కులను పరిశీలించి, ఏపీ ప్రజల ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలని వైఎస్ జగన్ కోరారు. తదుపరి చర్యలు తీసుకోకుండా సంబంధిత మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+