గోదావరికి పోటెత్తిన వరద: ఆరా తీసిన జగన్- రూ.12 కోట్లు అత్యవసరంగా విడుదల
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. హైదరాబాద్ మొదలుకుని అన్ని జిల్లాల్లోనూ ఏకధాటిగా వర్షాలు పడుతున్నాయి. ఫలితంగా- వాగులు, వంకలు పొంగుతున్నాయి. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాల వల్ల అటు గోదావరి నది వరదనీటితో పోటెత్తుతోంది.
ఇదే తరహా పరిస్థితి ఏపీలోనూ నెలకొంది. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాల ధాటికి గోదావరి పోటెత్తింది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో భారీగా ఉంటోంది. ఇన్ ఫ్లో పెరుగుతోండటంతో అధికారులు వరద నీటిని దిగువకు విడుదల చేస్తోన్నారు. ధవళేశ్వరం వద్ద అవుట్ ఫ్లో- 13.05 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది.

దీనితో విపత్తు నిర్వహణ విభాగం అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి నదికి వరద పోటెత్తిన నేపథ్యంలో- దీని ప్రభావం అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, ఏలూరు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 42 మండలాలపై పడింది. ఆయా మండలాల పరిధిలో ఉన్న 458 గ్రామాలు ముంపు భయాన్ని ఎదుర్కొంటోన్నాయి.
ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. అప్పటికప్పుడు సమీక్ష నిర్వహించారు. గోదావరిలో వరద పెరుగుతోండటంతో యుద్ధ ప్రాతిపదికన అన్ని రకాల సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముంపు గ్రామాల వారికి బాసటగా నిలవాలని ఆదేశించారు.

లోతట్టు ప్రాంత ప్రజల కోసం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాల్లో ఎలాంటి కొరతా లేకుండా చూసుకోవాలని సూచించారు. మంచినీరు సహా ఇతరత్రా సదుపాయాల్లో లోటు రానివ్వకూడదని స్పష్టంచేశారు. సహాయక చర్యలు కోసం ఆయా జిల్లాల కలెక్టర్లకు 12 కోట్ల రూపాయల నిధులు విడుదలచేశామని ఈ సందర్భంగా అధికారులు జగన్‌కు వివరించారు.
ముంపు ప్రాంత ప్రజలను సహాయక శిబిరాలకు తరలించామని, మందులు సహా ఇతరత్రా అత్యవసర వస్తువులను సిద్ధంగా ఉంచామని తెలిపారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 150 బోట్లను రెడీ ఉంచామని అన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సన్నద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బలగాలను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications