ఇదే చివరి నెల- జోరు పెంచిన జగన్: నవరత్నాలకు మించిన స్థాయిలో కొత్త ప్రకటన
Andhra Assembly elections 2024: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆ దిశగా ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సిద్ధం బహిరంగ సభలతో ఎన్నికల రణభేరీని మోగించింది.
ఇటీవలే విశాఖపట్నం జిల్లా భీమిలీలో నిర్వహించిన సభలో లక్షలాది మంది జనం మధ్య ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నెల 3వ తేదీన మలి విడత సభను ఏలూరు జిల్లా దెందులూరులోనిర్వహించబోతోంది వైఎస్ఆర్సీపీ. దీనికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అయిదు విడతల్లో 75 అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించింది.

ఈ క్రమంలో మరో అడుగు ముందుకేయనున్నారు వైఎస్ జగన్. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందు వచ్చిన చివరి నెల ఇదే కావడంతో జగన్ జోరు పెంచారు. ఈ నెలలో ముఖ్యమైన అన్ని కార్యక్రమాలను పూర్తి చేయనున్నారు. దీనికి సంబంధించిన ఓ షెడ్యూల్ కూడా సిద్ధమైంది.
ఈ నెల 13వ తేదీన విశాఖపట్నానికి బయలుదేరి వెళ్లనున్నారు. బిగ్గెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్ ఆడుదాం ఆంధ్రా ఫైనల్స్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. 16వ తేదీన కుప్పంలో పర్యటిస్తారు జగన్. చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గంలో వైఎస్సార్ చేయూత నిధులను విడుదల చేయనున్నారు.
18వ తేదీన సిద్ధం బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఇది ముగింపు సభ. అనంతపురం జిల్లా రాప్పాడులో జరిగే ఈ సభలోనే కొత్త ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు వైఎస్ జగన్. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన నవరత్నాలకు మించిన స్థాయిలో హామీలు ఉండొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి.
21వ తేదీన అన్నమయ్య రాయచోటి జిల్లాలో పర్యటిస్తారు. రైతుల ఇన్‌పుట్ సబ్సిడీని విడుదల చేస్తారు. 24వ తేదీన కర్నూలులో ఈబీసీ నేస్తం మూడో విడత నిధులను విడుదల చేస్తారాయన. 27వ తేదీన గుంటూరులో విద్యా దీవెన నాలుగో త్రైమాసికం నిధులను జగన్ విడుదల చేస్తారు.
మార్చి 5వ తేదీన శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లా నుంచి జగనన్న వసతి దీవెన రెండో విడత నిధులను విడుదల చేస్తారు. అదే నెల 6వ తేదీన చివరి మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications