బెంగళూరుకు జగన్... కుటుంబంతో 2 రోజులు... కుమార్తె హర్షారెడ్డికి వీడ్కోలు పలికేందుకు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం(అగస్టు 25) మధ్యాహ్నం 2.30గంటలకు బెంగళూరు బయలుదేరనున్నారు. కుమార్తె హర్షారెడ్డి ఉన్నత చదువుల కోసం పారిస్ వెళ్లనుండటంతో కుటుంబంతో సహా ఆమెకు వీడ్కోలు పలికేందుకు బెంగళూరు వెళ్లనున్నారు.
మొదట తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లనున్న ఆయన... అక్కడినుంచి బెంగళూరు వెళ్తారు. సాయంత్రం 4.30గంటలకు బెంగళూరులోని తన నివాసానికి చేరుకుంటారు. రెండు రోజుల పాటు అక్కడే ఉండనున్న ఆయన... కుమార్తెను పారిస్ పంపించాక 27వ తేదీ సాయంత్రం తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు.

కాగా,సీఎం జగన్ పెద్ద కుమార్తె ప్రతిష్టాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అమెరికాకు చెందిన ఓ మల్టీ నేషనల్ కంపెనీలో ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌గా జాబ్ ఆఫర్ కూడా వచ్చింది. అయితే జాబ్‌కు బదులు మాస్టర్స్ చదివేందుకే హర్షారెడ్డి మొగ్గుచూపారు.
పారిస్‌లోని ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో సీటు లభించడంతో మాస్టర్స్ చదివేందుకు అక్కడికి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో హర్షారెడ్డికి వీడ్కోలు పలికేందుకు జగన్ కుటుంబమంతా బెంగళూరు వెళ్లనుంది.సోమ,మంగళవారాల్లో(అగస్టు 19,20) కరోనా,వరదలు,తదితర అంశాలపై సమీక్షలతో బిజీబిజీగా గడిపిన జగన్... రెండు రోజుల పాటు కుటుంబంతో గడపనున్నారు.