ఏపీలో వారిద్దరి ఫార్ములాను ఫాలో అవుతున్న సీఎం జగన్?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకారం ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. కానీ ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన పార్టీలు తమ క్యాడర్ ను సిద్ధం చేస్తున్నాయి. ఎన్నికలు ఏ క్షణంలోనైనా రావచ్చని, ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి జగన్ తన ఎన్నికల టీమ్ ను సిద్ధం చేసుకుంటున్నారు. రాజకీయంగా వాతావరణం కూడా వేడెక్కింది.

సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలి..
రెండోసారి అధికారం చేపట్టాలంటే కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ కు తెలుసు. ఇప్పటికే పరిపాలనతోపాటు తనదైన శైలిలో ముందుకు సాగుతున్న జగన్ అటువంటి నిర్ణయాలు తీసుకుంటారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇటీవలే గుజరాత్ అసెంబ్లీ జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ ఏడోసారి విజయం సాధించి భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలో ఓటమిపాలయ్యారంటే నామర్దాగా ఉంటుంది కాబట్టి బీజేపీ అక్కడ రాజీపడలేదు.

వ్యతిరేకత వ్యక్తమైనవారికి సీట్లు లేవు..
గుజరాత్ లో వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను నరేంద్రమోడీ, అమిత్ షా మార్చేశారు. వారిలో మంత్రులు కూడా ఉన్నారు. తమకు సీట్లివ్వకపోవడాన్ని వారంతా వ్యతిరేకిస్తూ ఇండిపెండెంట్లుగా కూడా పోటీ చేశారు. అయినప్పటికీ బీజేపీ విజయాన్ని ఆపలేకపోయారు. ముఖ్యమంత్రి జగన్ కూడా ఏపీలో గుజరాత్ ఫార్ములాను ఉపయోగించాలని ప్రయత్నిస్తున్నారు. ఐప్యాక్ ద్వారా తాను చేయిస్తున్న సర్వే ప్రకారం అసమ్మతిని ఎదుర్కొనేవారు, ప్రజల్లో వ్యతిరేకత ఎదుర్కొనేవారిని గుర్తించి సీట్లు నిరాకరించాలనుకుంటున్నారు. పనితీరు బాలేనివారికి సీట్లివ్వనని, తనను విమర్శించుకున్నా ఇబ్బంది లేదని ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలతో జరుగుతున్న పలు సమావేశాల్లో జగన్ ఖరాఖండిగా చెబుతున్నారు.

కొందరు ప్రజాప్రతినిధులకు సమయం ఇస్తున్న జగన్
కొందరు ప్రజాప్రతినిధులకు సమయం ఇస్తున్నారు. సమయమిచ్చినప్పటికీ మారనివారు కొందరున్నారు. వైసీపీ వర్గాల సమాచారం ప్రకారం రానున్న ఎన్నికల్లో 175 నియోజకవర్గాలకుగాను ఇప్పుడున్న 150 మంది ఎమ్మెల్యేల్లో 40 నుంచి 45 మంది సిట్టింగ్ లకు సీట్లు నిరాకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. మారిన ఫార్ములా ఏమేరకు విజయవంతంగా నిలుస్తుందో చూడాలి. గుజరాత్ లో బలమైన ప్రతిపక్షం లేదు. కానీ ఏపీలో ప్రతిపక్షాలు రెండూ బలోపేతంగా ఉన్నాయి.












Click it and Unblock the Notifications