కుప్పం కలను నెరవేర్చనున్న జగన్
YS Jagan: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించిన నేపత్యంలో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. జనంలోకి వెళ్తోన్నారు. సిద్ధం పేరుతో ఏర్పాటు చేస్తోన్న భారీ బహిరంగ సభలతో ఎన్నికల సమరానికి సమాయాత్తమౌతున్నారు.
ఇప్పటికే రెండు విడతల్లో సిద్ధం బహిరంగ సభలు ముగిశాయి. విశాఖపట్నం జిల్లా భీమిలీలో నిర్వహించిన సభ సందర్భంగా ఆయన ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు. లక్షలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మధ్య ఎన్నికల రణభేరిని మోగించారు. క్యాడర్‌లో ఎన్నికల ఊపును తీసుకొచ్చారు.

ఇదే దూకుడును కొనసాగించనున్నారు వైఎస్ జగన్. ఈ నెల 26వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు. కుప్పం ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న హంద్రీ-నీవా జలాలను ఈ పట్టణానికి విడుదల చేయనున్నారు. కుప్పం వాసుల కలను సాకారం చేయనున్నారు.
2007లో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రాణం పోసుకున్న ప్రాజెక్ట్ ఇది. కుప్పానికి హంద్రీ-నీవా నీటిని ఇవ్వడానికి ఉద్దేశించిన డీపీఆర్‌ను వైఎస్సార్ ప్రభుత్వం ఆమోదించింది. పెద్ద తిప్పసముద్రం నుంచి కుప్పం వరకు పుంగనూరు బ్రాంచి కెనాల్‌ను నిర్మించేలా డీపీఆర్‌ను రూపొందించింది. దీన్ని యథాతథంగా ఆమోదించింది.
పుంగనూరు బ్రాంచి కెనాల్ ద్వారా మంచినీరు, సాగునీటి కోసం అప్పట్లోనే 1,700 కోట్ల రూపాయలను నిధులను మంజూరు చేసింది వైఎస్సార్ సర్కార్. ఇందులో భాగంగా పలమనేరు, కుప్పం నియోజకవర్గాల గుండా ప్రత్యేకంగా కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను నిర్మించింది. దీనికోసం అదనంగా 418 కోట్ల రూపాయలను మంజూరు చేసింది.

దశలవారీగా ఈ బ్రాంచ్ కెనాల్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. హంద్రీ-నీవా నీటిని ఈ కెనాల్ గుండా కుప్పం ప్రజల అవసరాల కోసం విడుదల చేయనున్నారు వైఎస్ జగన్. దీనికోసం ఈ నెల 26వ తేదీన కుప్పంలో పర్యటించనున్నారు. అనంతరం అక్కడే బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు నాయుడు.. తన సొంత నియోజకవర్గానికి హంద్రీ-నీవా జలాలను తరలించే విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చేశారని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. కనీసం కాలువను కూడా నిర్మించలేకపోయారని అన్నారు.












Click it and Unblock the Notifications