గెలిచింది 164 మంది.. అసెంబ్లీలో ఉన్నది 30 మందే
ఏపీ అసెంబ్లీలో ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన 11 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను వదిలేస్తే.. మిగిలిన 165 మందిలో మెజారిటీ సభ్యులు అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టారు. వేర్వేరు కారణాలు, వ్యక్తిగత పనుల నేపథ్యంలో వాళ్లు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజర్ అయ్యారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య 164. ఇందులో టీడీపీ బలం 135. జనసేనకు 21, బీజేపీకి ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు.

వీరిలో దాదాపుగా 100 మందికి పైగా ఎమ్మెల్యేలు నేటి సమావేశానికి హాజరు కాలేదని తెలుస్తోంది. 30 మంది మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. క్రియాశీలకంగా సభలో వ్యవహరించారు. ప్రశ్నోత్తరాలు, ఇతర బిల్లులపై డిబేట్లల్లో పాల్గొన్నట్లు సమాచారం. సభలో కోరం లేకపోవడం పట్ల చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ సమయానికి రాకపోవడం, ఆలస్యంగా సభకు రావడం, కార్యకలాపాలు కొనసాగుతుండగానే పలువురు ఎమ్మెల్యేలు బయటికి వెళ్లడం చంద్రబాబు దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా కీలక చర్చల సమయంలో సభ్యుల గైర్హాజరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారని అంటున్నారు. శాసనసభలో 30 మంది సభ్యులు మాత్రమే ఉండటంతో చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారని సమాచారం. దీంతో ఆయన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులును పిలిచి మాట్లాడారని, వెంటనే వారిని అసెంబ్లీకి రావాల్సిందిగా ఆదేశించాలని సూచించారు.
సమావేశాలకు గైర్హాజర్ అయిన వారిలో 17 మంది ఎమ్మెల్యేలకు విప్‌లు అప్పటికప్పుడు ఫోన్లు చేసి పిలిపించారని వార్తలు వచ్చాయి. ఇకపై అసెంబ్లీ సమావేశాలకు సభ్యులు పూర్తి స్థాయిలో హాజరయ్యేలా చూడాలని సీఎం చంద్రబాబు విప్ లకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. తాను ఉంటేనే అసెంబ్లీకి వస్తారా? అని అసహనం వ్యక్తం చేశారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications