వైఎస్ జగన్ కేరాఫ్.. ఇక అక్కడే: కమిటీ తుది నివేదిక
విశాఖపట్నం: సాగరనగరం విశాఖపట్నాన్ని రాజధానిగా బదలాయించే కార్యక్రమాలు మరింత వేగవంతం అయ్యాయి. కొన్ని న్యాయపరమైన అడ్డంకులు ఉన్నప్పటికీ- ప్రభుత్వం మాత్రం వెనుకంజ వేయట్లేదు. అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నానికి తరలించే పనులను వాయిదా వేస్తూ వస్తోందే తప్ప దానికి పుల్‌స్టాప్ పెట్టట్లేదు.
ఈ ఏడాది డిసెంబర్ నాటికి క్యాంప్ కార్యాలయాన్ని తరలించడానికి ప్రభుత్వం తన చర్యలను మళ్లీ మొదలుపెట్టింది. క్యాంప్ కార్యాలయం తరలింపు పనులను పర్యవేక్షించడానికి, వీటిని మరింత ముమ్మరం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ముగ్గురు అధికారులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

మున్సిపాలిటీ- పట్టణాభివృద్ధి, ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఇందులో సభ్యులు. క్యాంప్ కార్యాలయ తరలింపు ఏర్పాట్లన్నింటినీ ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. క్రమంగా- అన్ని శాఖలు, విభాగాధిపతుల కార్యాలయాలు విశాఖకు షిఫ్ట్ అవుతాయి. డిసెంబర్ నాటికి పూర్తిస్థాయిలో విశాఖపట్నం పరిపాలన రాజధానిగా మారుతుందనే అంచనాలు ఉన్నాయి.
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం, అధికారిక నివాస భవనం కోసం అయిదు ప్రాంతాలను ఎంపిక చేసింది ఈ కమిటీ. ఆంధ్రా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఓపెన్ యూనివర్సిటీ బ్లాక్స్, సిరిపురంలోని వీఎంఆర్డీఏ కాంప్లెక్స్, మిలీనియం-ఏ, మిలీనియం- బీ టవర్లు, రుషికొండ వద్ద గల టూరిజం రిసార్ట్ కాంప్లెక్స్‌ను పరిశీలించింది.

ఈ అయిదింట్లో- రుషికొండలోని టూరిస్ట్ రిసార్ట్ కాంప్లెక్స్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి అనువుగా ఉంటుందని నిర్ధారించింది. నగరానికి కాస్త దూరంగా ఉండటం వల్ల సాధారణ ప్రజలకు ఎలాంటి అసౌకర్యాన్ని కలిగించదని, రోజువారీ కార్యకలాపాలు, వాహనాల రాకపోకలకు ఆటంకం ఉండదని తీర్మానించింది.
వీఐపీల రాకపోకల వల్ల ట్రాఫిక్‌ను నిలిపివేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కాబోవనే అంచనాకు వచ్చిందా కమిటీ. క్యాంప్ ఆఫీస్‌కు వచ్చీ వెళ్లే వాహనాల రద్దీని తట్టుకునేలా రుషికొండ టూరిస్ట్ రిసార్ట్ ప్రదేశమే అనువుగా ఉంటుందని గుర్తించింది. భద్రతాపరంగానూ ఎలాంటి సమస్యలు ఉండబోవని అభిప్రాయపడింది.
విశాఖపట్నంలో ఇప్పటికే 2,27,287 చదరపు అడుగుల విస్తీర్ణంలో వివిధ ప్రభుత్వ శాఖలు, కార్యాలయాలు ఉన్నాయని కమిటీ వివరించింది. వివిధ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతుల కార్యాలయాలు అందులో ఏర్పాటు చేయవచ్చని సూచించింది. మిగిలిన కార్యాలయాలను ఐటీ హిల్‌లోని మిలీనియం టవర్‌కు తరలించవచ్చని పేర్కొంది.

మిలీనియం టవర్‌లో 1,75,516 అడుగుల విస్తీర్ణం అందుబాటులో ఉందని తెలిపింది. అలాగే- 3,98,600 చదరపు అడుగుల మేర ప్రైవేటు భవన సముదాయాలు ఉన్నట్లు వివరించింది. 8,01,403 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రభుత్వ, ప్రైవేట్ భవనాల్లో సీనియర్ ప్రభుత్వ అధికారులకు వసతిని కల్పించవచ్చని పేర్కొంది.
డిసెంబర్ నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాంప్ కార్యాలయాన్ని అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో డిసెంబర్ 17వ తేదీన గృహ ప్రవేశం చేయాలని వైఎస్ జగన్ తాజాగా నిర్ణయించారు. విశాఖ క్యాంప్ కార్యాలయం కేంద్రంగానే ఆయన భవిష్యత్ రాజకీయాలు ఉండబోతోన్నాయి. ఆయన ఎన్నికల పర్యటనల షెడ్యూల్స్ అన్నీ అక్కడే ఖరార్ కానున్నాయి.












Click it and Unblock the Notifications