'కొత్త' సవాల్: జగన్ పార్టీ నుంచి చేరికలు, పార్టీలో పోటీ పెంచిన బాబు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత పార్టీలో నేతలకు పోటీ పెట్టారు! ఒకే నియోజకవర్గంలోని ఇరువురు నేతల మధ్య ఆయన పోటీకి తెరలేపినట్లుగా కనిపిస్తోంది. వైసిపి నుంచి పలువురు ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కుతోన్న విషయం తెలిసిందే.
ఇప్పటికే 12 మంది వైసిపి ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరారు. మరో ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు వరుసలో ఉన్నారు. ఎమ్మెల్యేల చేరిక పైన ఆయా నియోకవర్గాల టిడిపి ఇంఛార్జులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. అయితే, వారిని చంద్రబాబు బుజ్జగించి.. ఎమ్మెల్యేలను సైకిల్ ఎక్కించుకుంటున్నారు.
ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి, శిల్పా సోదరులు, జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి వర్సెస్ రామసుబ్బారెడ్డిలుగా కనిపించిన విషయం తెలిసిందే. వారి చేరికల పైన టిడిపి ఇంఛార్జులు ఇప్పటికీ ఎంతోకొంత అసంతృప్తితో ఉన్నట్లుగానే కనిపిస్తోందనే చెప్పవచ్చు.

అయితే, చంద్రబాబు సూచనలు, ఆదేశాలు, హామీల మేరకు పార్టీల ఇంఛార్జులు కొంత తగ్గుతున్నారు. తమకు చంద్రబాబు హామీ ఇచ్చారని, నియోజకవర్గంలో తమ పని తాము చేసుకొని వెళ్తామని చెబుతున్నారు. అయితే, ఎమ్మెల్యేల చేరిక నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేతో పోటిపడి టిడిపి ఇంఛార్జులు పని చేసేందుకు సిద్ధమవుతున్నారు.
రెండు రోజుల క్రితం కదిరి ఎమ్మెల్యే చాంద్ భాషా తెలుగుదేశం పార్టీలో చేరారు. చాంద్ భాషా చేరికను కదిరి టిడిపి ఇంఛార్జ్ కందికుంట ప్రసాద్ స్వాగతించారు. ఇక నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని ఆయన చెప్పారు. తద్వారా వైసిపి నుంచి వచ్చిన ఎమ్మెల్యేకు ధీటుగా ప్రజల్లోకి వెళ్లేందుకు సన్నద్దమయ్యారని చెప్పవచ్చు.
కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా తెలుగుదేశం పార్టీలో చేరితో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తాను తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముందే చెప్పానని కదిరి టిడిపి ఇంచార్జ్ కందికుంట ప్రసాద్ ఆదివారం తెలిపారు. ఆయన చేరిక కార్యక్రమంలో తాను ఉండనని ముందే చంద్రబాబుకు చెప్పానని తెలిపారు. ఇక నుంచి పార్టీ కార్యక్రమాల్లోచురుగ్గా పాల్గొంటానని చెప్పారు.












Click it and Unblock the Notifications