ఢిల్లీకి బాబు 'దళిత' వ్యాఖ్యల దుమారం: ఆదినారాయణ చేరికపై తేల్చేసిన సీఎం
విజయవాడ/న్యూఢిల్లీ: కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఆయనకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఎస్సీలలో పేదలు ఎక్కువగా ఉన్నారని, పేదలుగా పుట్టాలని ఎవరు అనుకుంటారని చంద్రబాబు అన్నారు.
దీంతో చంద్రబాబు ఎస్సీలను అవమానించారంటూ విపక్షాలు మండిపడ్డాయి. దీనిపై తాజాగా ఏపీ ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు ప్రతాప్ కుమార్ జాతీయ ఎస్సీ కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. దళితుల పైన వివక్షాపూరిత వ్యాఖ్యలు చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆదినారాయణ రెడ్డి చేరికపై తేల్చి చెప్పిన బాబు

కడప జిల్లాకు చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేరిక పైన పార్టీకి చెందిన సీనియర్ నేత రామసుబ్బా రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆదినారాయణ రెడ్డి టిడిపిలో చేరనున్నారని చాలారోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
ఆయన చేరికను సీనియర్ టిడిపి నేత రామసుబ్బా రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. అయితే, రామసుబ్బా రెడ్డికి చంద్రబాబు నచ్చచెప్పారని తెలుస్తోంది. సోమవారం సాయంత్రం రామసుబ్బారెడ్డి.. చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా ఆదినారాయణను చేర్చుకుంటున్నట్లు సీఎం అతనికి చెప్పారని తెలుస్తోంది.
సస్పెన్షన్.. రోజా పిటిషన్ పైన విచారణ రేపటికి వాయిదా
వైసిపి ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ పిటిషన్ పైన హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. గతేడాది శాసనసభ సమావేశాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఏడాదిపాటు ఆమెను స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేశారు. దానిపై రోజా హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications